● రైతులు, భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తిరుమలాయపాలెం: పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇదే సమయాన రైతులు, భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి నుంచి బీరోలు వరకు నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడారు. మేడిదపల్లికి కేటాయించిన రూ.10.78 కోట్ల నిధులతో కొన్ని పనులు పూర్తికాగా, మరికొన్ని చివరిదశలో ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.77 లక్షలు వెచ్చించామని, తాగునీటి సమస్య పరిష్కారానికి మూడు బోర్లు మంజూరు చేశామని తెలిపారు.
భూవివాదాలకు శాశ్వత పరిష్కారం
పాలేరు నియోజకవర్గం అంతటా భూముల రీసర్వే నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. తద్వారా దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు పరిష్కారం లభించడమేకాక కుటుంబాలకు భూమిపై స్పష్టమైన యాజమాన్య హక్కు లభిస్తుందన్నారు. అలాగే, రైతులకు అండగా నిలుస్తూ పండిన ప్రతి గింజను తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో సాగు, తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలకు కేంద్ర సాయం కోరుతున్నామని మంత్రి చెప్పారు. కాగా, కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఆర్‌డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సిలార్‌సాహెబ్, తహసీల్దార్ లూథర్ విల్సన్ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, సర్పంచ్‌లు మోర అనిల్‌రెడ్డి, గుమ్మడి దేవభిక్షం, నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, కొప్పుల అశోక్, బెల్లం శ్రీనివాస్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.


