● ఆన్‌లైన్ చేసుకుంటున్న ఉద్యోగ, పెన్షనర్లు ● అప్రూవల్ కాగానే కార్డుల జారీ
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతనంగా హెల్త్‌కార్డులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని రెగ్యులర్ ఉద్యోగులు 7,242మందితో పాటు పెన్షనర్లు 13,182మందికి కార్డులు అందనున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులు ఇప్పటికే తమ వివరాలను ఆన్‌లైన్ చేసుకున్నారు. ఆపై సంబంధిత విభాగం డ్రాయింగ్ ఆఫీసర్ ద్వారా ఆన్‌లైన్‌లో హెల్త్‌కేర్ ట్రస్ట్‌కు పంపించి, అక్కడ అప్రూవల్ కాగానే కార్డులు జారీ అవుతున్నాయి. ఉద్యోగులు నేరుగా(ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్, తెలంగాణ – ఈహెచ్‌ఎస్ వెబ్‌సైట్) ద్వారా ఐడీ నంబర్ నమోదు చేసుకొని ఓటీపీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆపై అప్రూవల్ అయి ఉంటే నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కుటుంబంలోని ఒక్కొక్కరికి ఒక్కో హెల్త్‌కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. ఇప్పటివరకై తే రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించిన హెల్త్‌కార్డులు మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
పెన్షనర్లకు ఇలా...
పెన్షనర్లు ఆన్‌లైన్‌లో హెల్త్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆయా దరఖాస్తులను సబ్ ట్రెజరీ ఆఫీసర్ అప్రూవల్ చేశాక హెల్త్‌కేర్ ట్రస్ట్‌కు ఆన్‌లైన్‌లో వెళ్తుంది. అక్కడ అప్రూవల్ అయ్యాక కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పెన్షనర్ల హెల్త్‌కార్డులు జిల్లా ఎస్‌టీఓల స్థాయిలో ఆన్‌లైన్‌లో చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా రు. కాగా, హెల్త్‌కార్డుపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫొటోలు, రాష్ట్ర చిహ్నం ఉన్నాయి.


