ముదిగొండ: మండలంలోని ఖానాపురంలో చేపట్టిన భూముల రీ సర్వేను బుధవారం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. భూములు, ఇప్పటివరకు జరిగిన సర్వే వివరాలపై తహసీల్దార్ రవికుమార్, సర్వేయర్లతో చర్చించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు ముందస్తు సమాచారం ఇస్తూ రీ సర్వే పకడ్బందీగా చేయాలని సూచించారు. ఆర్‌ఐ కల్యాణి, సర్వేయర్లు పాల్గొన్నారు.
శాసీ్త్రయ విధానాలతో అధిక దిగుబడి
మధిర: రైతులు సంప్రదాయ విధానాలకు బదులు సాగులో ఆధునికత విధానాలు అమలుచేస్తే అధిక దిగుబడులు వస్తాయని మధిర వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రుక్మిణీదేవి సూచించారు. మధిర రైతువేదికలో బుధవారం ఆత్మ కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సాగు సమయంలోనే అధిక దిగుబడి వచ్చే మేలు రకాల విత్తనాలు ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఆతర్వాత తెగుళ్ల నివారణ, నాణ్యమైన విత్తనాల ఎంపికపై అవగాహన కల్పించగా శాస్త్రవేత్త నాగస్వాతి, ఉద్యానవన శాఖ అధికారి విష్ణు, వ్యవసాయ అధికారి సాయిదీక్షిత్ వివిధ అంశాలపై మాట్లాడారు. ఆత్మ డైరెక్టర్లు గోపాల్‌రావు, శ్రీలక్ష్మి, కౌన్సిలర్ నాగేశ్వరరావు, ఏఈఓలు పాల్గొన్నారు.
పోషకాహారంతో
రక్తహీనతకు చెక్
కల్లూరురూరల్: గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇస్తున్న పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రమీల తెలిపారు. కల్లూరు మండలం చంద్రుపట్లలో బుధవారం జరిగిన పోషణ మాసోత్సవాల సదస్సులో ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బలమైన పోషకాహార పదార్థాలను అందిస్తున్నామని చెప్పారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించగా, లోకవరంలో బాలల రక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. సూపర్‌వైజర్లు ఉషారాణి, సుజాత, సర్పంచ్ కాటంలేని విజయలక్ష్మి, కౌన్సిలర్ కళ్యాణపు ప్రమీల, అంగన్‌వాడీ టీచర్లు జ్యోతి పద్మ, యశోద, కృష్ణవేణి. రుక్మిణి, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
నేటితో ముగియనున్న వరి సాగు నమోదు
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి సాగు చేస్తున్న రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకునే గడువు గురువారంతో ముగియనుంది. నిర్దేశించిన రకాలు సాగు చేస్తున్న వారు రశీదులతో విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్లను సంప్రదించి పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలని డీఏఓ ధనసరి పుల్లయ్య సూచించారు. సొంత విత్తనం లేదా ఇతర రైతుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన వారైతే పూర్తి వివరాలతో ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్న రైతులకే ప్రభుత్వం చెల్లించే బోనస్ అందనున్నందున సద్వి నియోగం చేసుకోవాలని డీఏఓ తెలిపారు.
టీపీఎస్‌లకు
రూ.12కోట్ల నిధులు
బోనకల్: అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించేలా ఏర్పాటుచేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు రాష్ట్రప్రభుత్వం రూ.12.84 కోట్ల నిధులు కేటాయించింది. బోనకల్ మండలంలోని రావినూతల, చిరునోముల పాఠశాలలను టీపీఎస్‌లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు భవన నిర్మాణాలు, వసతుల కల్పన కోసం నిధులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదల కాగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.


