సైన్యాలపై గర్జించిన
విప్లవ యోధులెందరో..
నేటి పోరాటాలకు స్ఫూర్తిగా
సాయుధ రైతాంగ పోరు
అణచివేత, దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో ఖమ్మం గడ్డకు సుదీర్ఘ చరిత్ర ఉంది. రజాకార్ల దమనకాండకు విప్లవ యోధులు ఎదురొడ్డి వారి దాష్టికాలను నిలువరించారు. ప్రాణాలను లెక్కచేయకుండా ఆయుధాలు చేత పట్టి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. నిజాం నవాబుపై పోరాటానికి ఎందరో నాయకులను అందించిన ప్రాంతంగా ఉమ్మడి జిల్లాకు పేరుంది. నాటి సాయుధ రైతాంగ పోరాటం
నేటి అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలవడమే కాక పోరాటాల గడ్డగా జిల్లాకు పేరు సాధించి పెట్టింది. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఏటా సెప్టెంబర్ 17న(నేడు) నాటి వీరులకు జిల్లా ప్రజానీకం నివాళులర్పించనున్న నేపథ్యాన ప్రత్యేక కథనం. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
బోనకల్ మండలంలోని పల్లెలు సాయుధ పోరాటంలో అగ్నిశిఖలై రగిలాయి. చిరునోములకు చెందిన తామ్రపత్ర గ్రహీత రావెళ్ల జానకి రామయ్య ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ రజాకార్లకు వ్యతిరేకంగా యువతను చైతన్యవంతం చేశారు. భూస్వాముల వెట్టిచాకిరీపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. మల్లెల వెంకటేశ్వర్లు దళ కమాండర్‌గా, చుండూరు నరసింహారావు, తమ్మారపు గోవిందు, జొన్నలగడ్డ రామయ్య ఉప కమాండర్లుగా వ్యవహరిస్తూ ముష్టికుంట్ల, లక్ష్మీపురం, బ్రాహ్మణపల్లి ప్రాంతాల యువతను పోరాట బాట పట్టించారు.
నిజాం అరాచకాలపై
తిరగబడిన ఖమ్మం గడ్డ


