ఖమ్మం సహకారనగర్: జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరికి తుది జాబితాలో స్థానం దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సరైన ఆధారాలతో విచారణకు హాజరయ్యే అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 1,75,841 నోటీసులకు గాను 1,60,623 నోటీసులు(91.34 శాతం) జారీ చేశామన్నారు. ఇందులో ఇప్పటివరకు 81,446 మందికి విచారణ పూర్తయిందని తెలిపారు. ఖమ్మం నగర పరిధిలో ఆన్‌లైన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారమ్‌లు సమర్పించిన ఓటర్లు అందుబాటులో లేక 9వేలకు పైగా నోటీసుల జారీలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. అనంతరం పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఈవీఎం గోదాంను తనిఖీ చేసి భద్రతపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఎస్‌డీసీ సదానందం, వివిధ శాఖల ఉద్యోగులు ఎం.ఏ.రాజు, లఖన్‌నాయక్, అన్సారీ పాల్గొన్నారు.
సజావుగా నిర్వహించాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ, అనామిలిస్ జాబితాలోని ఓటర్లకు నోటీసులు జారీ చేయడమే కాక విచారణలో వారు సమర్పించిన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఖమ్మం బస్ డిపో రోడ్, పాత డీఆర్‌డీఓ కార్యాలయ పరిధిలో విచారణ శిబిరాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హియరింగ్‌కు హాజరైన ఓటర్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
అధునిక పరిజ్ఞానంతో భూముల రీసర్వే
ఖమ్మంరూరల్: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు కచ్చితమైన భూ రికార్డులను రూపొందించడమే లక్ష్యంగా రీ సర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. మండలంలోని పల్లెగూడెంలో రీసర్వేను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఇప్పటికే చేసిన సర్వే, ఎదురైన సమస్యలపై ఉద్యోగులతో చర్చించారు. అనంతరం రైతులతో మాట్లాడి రీసర్వే ఉద్దేశంపై అవగాహన కల్పించి సరైన పత్రాలతో ఉద్యోగులకు సహకరించాలని సూచించారు. సర్వేకు అందరూ సహకరిస్తేనే సమస్యలు పరిష్కారమై యజమానులకు హక్కులు దక్కుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినయేందర్‌రెడ్డి, సర్వేయర్లు పాల్గొన్నారు.
ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు
ఖమ్మంగాంధీచౌక్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టి అర్హులెవరూ నష్టపోకుండా చూడాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. కలెక్టరేట్‌లో మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, హౌజింగ్ అధికారులతో సమావేశమైన ఆయన లబ్ధిదారుల ఎంపికపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీల నుంచి వచ్చిన లబ్ధిదారుల పేర్లను అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాక అర్హతల ఆధారంగా ఎంపిక చేయాలని తెలిపారు. గతంలో తప్పుడు సమాచారం, సర్వే లోపాలతో పలువురు పేదల పేర్లు ఎల్–3 జాబితాలో చేరాయని, ఈసారి అలాంటి తప్పిదాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే, పంచాయతీకి సమీపంలో ఉచిత ఇసుక లభ్యత స్థలాలను గుర్తించాలని, ఇసుక కొరత ఉన్న మండలాల్లో గోదావరి లేదా ఇతర వనరుల నుండి ఇసుక తెచ్చి నిల్వ చేసేలా స్థలాలు ఎంపిక చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, శిక్షణ సహాయ కలెక్టర్ పారస్ కుమార్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘ఎస్‌ఐఆర్’పై సమీక్షలో కలెక్టర్ దివాకర


