ఎన్‌ఎంసీ తనిఖీలు పూర్తి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంసీ తనిఖీలు పూర్తి

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

● మెడికల్‌ కాలేజీలో 25 పీజీ సీట్లకు ప్రతిపాదన ● అనుమతి లభిస్తే ఈ ఏడాదే ప్రవేశాలు

● మెడికల్‌ కాలేజీలో 25 పీజీ సీట్లకు ప్రతిపాదన ● అనుమతి లభిస్తే ఈ ఏడాదే ప్రవేశాలు

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) సీట్ల అనుమతులకు అడుగులు పడుతున్నాయి. అధికారులు పంపించిన ప్రతిపాదనల మేరకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) బృందం బోధన ఆస్పత్రితో పాటు మెడికల్‌ కళాశాలలో తనిఖీలు చేపట్టింది. ఎన్‌ఎమ్‌సీ నిబంధనల ప్రకారం వసతులు, సౌకర్యాలు, బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య తదితర వివరాలు పరిశీలించారు. ఈనెల 3వ తేదీన ఒక విభాగంలో పరిశీలనతో తనిఖీలు మొదలుకాగా, బుధవారం చివరి విభాగంలో తనిఖీ పూర్తి చేశారు.

ఐదు విభాగాల్లో సీట్లకు కసరత్తు

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో 2023 ఏడాది ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు మొదలయ్యాయి. ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరానికి ఇప్పటికే 72 మంది చేరారు. కౌన్సెలింగ్‌ పూర్తయ్యే నాటికి 100 సీట్లు భర్తీ కానుండగా, వచ్చే నెల మొదటి వారంలో తరగతులు మొదలవుతాయి. ఈనేపథ్యాన కళాశాలలో 25 పీజీ సీట్ల కోసం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శంకర్‌ నేతృత్వాన డీఎంఈకి ప్రతిపాదించారు. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, అనస్తీషియా, ఆర్థోపెడిక్‌, గైనకాలజీ విభాగాల్లో ఐదేసీ సీట్ల చొప్పున 25 సీట్లు అవసరమని నివేదించగా.. డీఎంఈ నుంచి ఎన్‌ఎంసీకి ప్రతిపాదనలు చేరాయి. ఈక్రమాన కళాశాల, ఆస్పత్రిలో పీజీ బోధనకు సరైన వసతులు ఉన్నాయో, లేదో పరిశీలనకు ఎన్‌ఎంసీ బృందం తనిఖీలు చేపట్టింది.

అన్ని విభాగాల్లో పరిశీలన

ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు ఆస్పత్రితో పాటు కళాశాలలో సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్నాయో, లేదో తెలుసుకునేందుకు ఐదు విభాగాల్లో బృందాలు ఈ రెండు వారాల్లో తనిఖీ చేపట్టాయి. ఈనెల 3న సిరిసిల్ల మెడికల్‌ కళాశాలకు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంధ్య నేతృత్వాన గైనకాలజీ విభాగంలో, 9వ తేదీన జనరల్‌ సర్జరీ విభాగాన్ని ఒడిశాకు చెందిన భరత్‌కుమార్‌, అనస్తీసియా విభాగాన్ని పూణేకు చెందిన డాక్టర్‌ వీణ, ఈ నెల 10వ తేదీన ఆర్థో విభాగాన్ని వారణాసికి చెందిన అషుతోష్‌ విక్ర మ్‌, చివరగా బుధవారం జనరల్‌ మెడిసిస్‌ విభాగా న్ని కర్ణాటకకు చెందిన డాక్టర్‌ రమేష్‌ కె.నారాయణ స్వామి బృందం తనిఖీ చేపట్టింది. అంతేకాక పూర్తి వివరాలను ఎన్‌ఎంసీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ నివేదిక ఆధారంగా పీజీ సీట్లకు అనుమతి వస్తే ఈ ఏడాదే ప్రవేశాలు కల్పించనుండగా, ఆస్పత్రిలో వైద్యుల కొరత తీరి, సేవలు మరింత మెరుగుపడే అవకాశముందని మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎన్‌.శంకర్‌ వెల్లడించారు. కళాశాలలో బోధన, ఆస్పత్రి సౌకర్యాలపై ఎన్‌ఎంసీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యాన తప్పక అనుమతి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement