ఏన్కూరు: గురుకులాలు, కేజీబీవీల్లోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు కోరారు. ఏన్కూరులోని గురుకులం, కేజీబీవీని మంగళవారం ఆయన నాయకులతో కలిసి సందర్శించారు. తొలుత ఎస్సెస్సీ ఉత్తమ ఫలితాలు నమోదైన కేజీబీవీ ప్రిన్సిపాల్ లావణ్యను సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ గురుకులాల పనివేళలను మార్చడమే కాక రాత్రి విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులకు సీసీఎల్ ఇవ్వాలని, రెండో శనివారం సెలవు ప్రకటించడమే కాక హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్‌టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.గోపి, బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తుఫాన్ బాధితులకు చేయూత
ఖమ్మం మామిళ్లగూడెం: అసోంలో ఎదురైన తుఫాన్‌తో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు జమియాతే ఉలేమాయే హింద్ సంస్థ బాధ్యలు ముందుకొచ్చారు. ఈమేరకు జిల్లాలోని మసీదుల్లో రూ.1,52,200 విరాళాలు సేకరించారు. ఈ నగదును మంగళవారం జేయూహెచ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎహెసనుద్దీన్‌కు జిల్లా బాధ్యులు మహమ్మద్ జవ్వాద్ అహ్మద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఫ్తీ సయీద్ అహ్మద్ ఖాస్వీ తదితరులు పాల్గొన్నారు.
సాగర్ జలాలతో
రైతులను ఆదుకోవాలి
చింతకాని: పంటలను కాపాడేలా సాగర్ జలాలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు డిమాండ్ చేశారు. చింతకాని తహసీల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యాన మంగళవారం ధర్నా నిర్వహించగా ఆయన మాట్లాడారు. ఎల్‌నినో సాకుతో సాగర్ జలాలను విడుదల చేయకుండా ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోందని విమర్శించారు. ఇకనైనా నీరు విడుదల చేయడంతో పాటు యూరియా యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా సొసైటీల ద్వారా సరఫరా చేయాలన్నారు. అలాగే, పెసలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ తహసీల్దార్ కరుణశ్రీకి వినతిపత్రాన్ని అందజేశారు. కాగా, నల్లగొండలో నవంబర్ 15వ తేదీ నుంచి జరిగే రైతు సంఘం జాతీయ మహాసభలన జయప్రదం చేయాలని సుదర్శన్‌రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చింతకానిలో 36 బెలూన్లు ఎగరవేసి ర్యాలీ నిర్వమించగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, సీపీఎం డివిజన్, మండల కార్యదర్శులు మడుపల్లి గోపాలరావు, దేశబోయిన ఉపేందర్, నాయకులు వత్సవాయి జానకీరాములు, తోటకూరి వెంకటనర్సయ్య, రౌతు అప్పారావు, దొడ్డ చందర్‌రావు, మద్దిని బసవయ్య, ఆలస్యం రవి తదితరులు పాల్గొన్నారు.
పిడుగుపాటుతో
వ్యక్తికి గాయాలు
వైరారూరల్: మండలంలోని తాటిపూడికి చెందిన చిలక వెంకటేశ్వర్లు పిడుగుపాటుతో గాయపడ్డారు. ముసలిమడుగులోని గిరిజన సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతున్న కుమార్తెను చూసేందుకు సోమవారం ఆయన వెళ్లారు. పాఠశాల గేట్ వద్ద నిలబడి ఉండగా సమీపంలో పిడుగు పడడంతో వెంకటేశ్వర్లు సొమ్మసిల్లగా, స్థానికులు వైరాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
వ్యభిచార ముఠా
నిర్వాహకుడిపై పీడీ యాక్ట్
ఖమ్మం క్రైం: మహిళలను వ్యభిచారంలోకి దింపి ఆర్థిక లాభాలు పొందుతున్న బత్తుల బాలకృష్ణపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన ఆయన జిల్లాలోని వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నాడనిగుర్తించారు. ఈమేరకు ఖమ్మం టూ టౌన్, త్రీ టౌన్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి 6న ఖమ్మం గాంధీచౌక్‌లోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా బాలకృష్ణతో పాటు మరో మహిళ, లాడ్జి మేనేజర్ పట్టుబడ్డారు. ఈక్రమాన బాలకృష్ణపై పీడీ యాక్ట్ నమోదు చేసి చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.


