భార్యను వెతికి వస్తుండగా ఉపాధ్యాయుడు మృతి | - | Sakshi
Sakshi News home page

భార్యను వెతికి వస్తుండగా ఉపాధ్యాయుడు మృతి

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

బోనకల్‌: మండలంలోని రామాపురం రైల్వే గేట్‌ సమీపంలో రైలు నుండి ప్రమాదవశాత్తు జారి పడిన ఉపాధ్యాయుడు మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్ల గ్రామానికి చెందిన జాటోతు సుందర్‌(50) మైలవరం ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉండగా ఇటీవల మతిస్థిమితం కోల్పోయిన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెను వెతికే క్రమాన హైదరాబాద్‌ వెళ్లి రైలులో తిరిగి వస్తుండగా సుందర్‌ ప్రమాదవశాత్తు జారి పడడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. ఈమేరకు రైల్వే పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని రేగళ్ల పంపించారు.

చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో జైలుశిక్ష

ఖమ్మం లీగల్‌: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్క చెల్లకపోవడంతో ముదిగొండకు చెందిన కొడకండ్ల రామారావుకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బిక్కం రజిని మంగళవారం తీర్పు చెప్పారు. ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు వద్ద రామారావు 2018 డిసెంబర్‌లో రూ.5.10లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2021 జూలైలో రూ.8.26లక్షలకు చెక్కు ఇచ్చిన ఆయన ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో వెంకటేశ్వర్లు కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేయగా, విచారణ అనంతరం రామారావుకు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.8.26లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

మరొకరికి...

ఖమ్మం బుర్హాన్‌పురానికి చెందిన మైలవరపు సంతోష్‌ వద్ద డాబాల బజార్‌ వాసి రాయపూడి శ్రీధర్‌ 2016 మేలో రూ.4 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2018 జూలైలో రూ.6.12లక్షలకు చెక్కు జారీ చేసినా ఆయన ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో సంతోష్‌ తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీస్‌ జారీ చేసి కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం శ్రీధర్‌కు ఏడాది జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.10లక్షలు చెల్లించాలని ఖమ్మం మూడో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి అరవ ప్రవీణ్‌ మంగళవారం తీర్పు చెప్పగా రూ.5వేల జరిమానా సైతం విధించారు.

హత్యాయత్నం కేసులో ఐదేళ్లు..

ఖమ్మం లీగల్‌: హత్యాయత్నం కేసులో ఖమ్మం చెరువు బజార్‌ చెందిన మరుపల్లి రాంబాబుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి శివరంజని మంగళవారం తీర్పు చెప్పారు. అంతేకాక రూ.41,500 జరిమానా విధించారు. ఖమ్మం వన్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఆయనపై 2024లో హత్యాయత్నం కేసు నమోదైంది. విచారణ అనంతరం దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు. కేసు దర్యాప్తు ఎస్సైలు ఓ.వెంకటేష్‌, యయాతి రాజు చేపట్టగా ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ పాపని స్వప్న వాదనలు వినిపించారు. ఈమేరకు ఎస్సైలు, ఏపీపీతో పాటు సీఐ కరుణాకర్‌, కానిస్టేబుల్‌ రామకృష్ణను సీపీ సునీల్‌దత్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement