ముదిగొండ: పోక్సో కేసు నమోదైన యువకుడిని వేధించిన ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ముదిగొండ పోలీసుస్టేషన్ వద్ద బంధువులు సోమవారం ఆందోళన చేపట్టారు. నిరసన తెలిపారు. ముదిగొండకు చెందిన మెట్టెల వినయ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదు కాగా జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, బాలిక బంధువుతో పాటు నూకల నాగేశ్వరరావు రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసిన వినయ్ గత శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈమేరకు ఆయన మృతికి కారకులపై చర్య తీసుకోవాలని వినయ్ తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు సోమవారం పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. వినయ్ చనిపోయి ఐదు రోజులవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అరగంట పాటు స్టేషన్ ఎదుట మెట్టెల విజయ్ తల్లిదండ్రులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయమై సీఐ మురళిని విరణ కోరగా వినయ్ తండ్రి గోపయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే, వారు ఫిర్యాదులో పేర్కొన్న ఇద్దరు పరారీలో ఉండడంతో ఆచూకీ కోసం తమ సిబ్బంది గాలిస్తున్నారని వెల్లడించారు.


