● జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం ● వడబడుతున్న పైర్లకు ప్రాణం
ఖమ్మంవ్యవసాయం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు రుతుపవన ద్రోణి కారణంగా శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సింగరేణి మండలంలో భారీవర్షం కురవగా, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో తేలికపాటి వర్షం నమోదైంది. గేటు కారేపల్లిలో 65 మి.మీ. భారీ వర్షపాతం నమోదు కాగా సత్తుపల్లిలో 53.5, సత్తుపల్లి ఓసీల వద్ద 51.5, పెనుబల్లిలో 36.3, వేంసూరులో 25.6 మి.మీల వర్షపాతం నమోదైంది. అలాగే, సిరిపురంలో 8, వైరా ఏఆర్‌ఎస్ వద్ద 6.8, కల్లూరులో 6.5, పంగిడిలో 6.3, కుర్నవల్లిలో 4 మి.మీ.ల వర్షపాతం నమోదైందని అధికారులు నివేదిక విడుదల చేశారు.
ప్రాణం పోసుకున్న పైర్లు
కొద్దిరోజులుగా వర్షాలు లేకపోగా, మండిపోతున్న ఎండలతో పత్తి, మిర్చి, వరి పంటలు వడబడుతున్నాయి. ఈ నేపథ్యాన శనివారం కురిసిన వర్షంతో పైర్లకు కొంత మేర ప్రాణం పోసినట్లయింది. ప్రధానంగా పూత, కాత దశలో ఉన్న పత్తికి ఈ వాన ప్రయోజనం కలిగిస్తుంది. పత్తి కాయ విచ్చుకొని పంట వచ్చేందుకు ఈ వాన దోహదపడే అవకాశముంది. అలాగే, ఉద్యాన పంటలు, కూరగాయల పంటలు, మిర్చితో పాటు వరికి కూడా కొంత మేరకు ప్రయోజనం కలిగించింది. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉండడంతో భారీ వర్షంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇక వర్షంతో వాతావరణం చల్లబడగా ఉక్కపోతతో సతమతమైన జనం ఊపిరి పీల్చుకున్నారు.


