ఖమ్మం అర్బన్: గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనానికి భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా నిర్వాహకులు సహకరించాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులతో ఖమ్మంలో గురువారం ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్నేటిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ధంసలాపురం కొత్తూరు చెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం పీఓపీ కాకుండా మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాలని సూచించారు. అంతేకాకుండా మండపాల వివరాలను పోలీస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. అలాగే, మండపాల ఏర్పాటు, విద్యుత్ వైరింగ్, అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన సీపీ.. డీజేలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కాగా, ప్రధాన రహదారులు, వివాదాస్పద స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీలు రమణమూర్తి, మహేష్, సీఐలు కరుణాకర్, బాలకృష్ణ, మోహన్‌బాబు, భానుప్రకాష్, ఉస్మాన్ షరీఫ్, సత్యనారాయణ, విద్యుత్ శాఖ డీఈ రామారావు, ఫైర్ అధికారి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమన్వయ సమావేశంలో సీపీ సునీల్‌దత్


