ఖమ్మం రాపర్తినగర్: మై భారత్, యువజన శాఖ ఆధ్వర్యాన జాతీయ స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల లోగోను జిల్లా అధికారి ఎం.వెంకట్ రాంబాబు గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’పేరిట ఆన్‌లైన్ క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించనుండగా, 15 – 29 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులని తెలిపారు. తెలుగుతో పాటు 22భాషల ద్వారా పోటీల్లో పాల్గొనవచ్చని, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటిన వారు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి డైలాగ్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 30వ తేదీలోగా mybharat.gov.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బానోతు రెడ్డి, అధ్యాపకులు, ఉద్యోగులు కె.భానుచందర్, డాక్టర్ చరిత్ర, సయ్యద్ షారూఖ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.


