వయస్సు తేడా లేకుండా బాధితులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న వైద్యులు
వ్యాయామం తప్పనిసరి
కార్డియాక్ అరెస్ట్
ఖమ్మం వైద్యవిభాగం: ఒకప్పుడు గుండె పోటు అంటే వయస్సు మళ్లిన వారికే వస్తుందని భావించేవారు. సుమారు 50 ఏళ్లు పైబడిన వారు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులే ఎక్కువగా బాధితుల జాబితాలో ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, యుక్త వయస్సు వారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వ్యాయామం చేస్తూ కొందరు, నృత్యం చేస్తూ ఇంకొందరు.. ఉన్నట్టుండి కుప్పకూలి మరికొందరు మృత్యువాత పడుతున్నారు. అక్కడికక్కడే మృతి చెందేవారు కొందరైతే, మరికొందరి ప్రాణాలు వైద్యుల వద్దకు తీసుకెళ్లే లోపే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గుండెలో రక్త నాళాలు కుచించుకుపోవడం వల్ల రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండెపోటు వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇటీవల యుక్త వయస్సు వారు, ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే వారు కూడా గుండెపోటుకు గురవుతుండడంతో జనాల్లో ఆందోళనకు కారణమవుతోంది.
జీవనశైలిలో మార్పులతో...
ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరగడానికి జీవన విధానంతో పాటు ఆహార శైలిలో వచ్చే మార్పులే కారణమని వైద్యులు చెబుతున్నారు. యువత ఎక్కువగా జంక్‌ఫుడ్ తినడం, మత్తు పదార్థాలు తీసుకోవడంతో అనారోగ్యం ఎదురవుతుంది. ఈ ప్రభావం శరీరంలోని అవయవాలపై పడి చిన్న వయసులోనే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. ఆధునిక జీవన శైలికి అలవాటు పడడంతో శారీరక శ్రమ మరిచిపోవడం, వ్యాయామం లేకపోవడం కూడా వ్యాధులకు కారణమవుతోంది. కలుషిత ఆహారం కూడా రక్త ప్రసరణ సక్రమంగా జరగకుండా అడ్డుకుంటుంది. అంతేకాక పురుగు మందులు ఎక్కువగా వాడిన కూరగాయలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు తీసుకుంటే కేన్సర్‌తో పాటు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
సత్తుపల్లిలో నివాసముంటున్న 65 ఏళ్ల ఏలపాటి భారతమ్మ బుధవారం ఇంట్లో ఉండగా.. అకస్మాత్తుగా కింద పడి అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రఘునాథపాలెం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకులంలో ఎనిమిదో తరగతి చదువుతున్న 14ఏళ్ల విద్యార్థి బుధవారం ఉదయం స్నేహితులతో కలిసి ఆడుకుంటూ మైదానంలో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడని వైద్యులు తేల్చారు. విద్యార్థి మృతికి స్పష్టమైన కారణాలు తెలియకున్నా ఆకస్మిక గుండెపోటే కావొచ్చని అనుమానిస్తున్నారు.
ఆందోళన కలిగిస్తున్న గుండెపోటు మరణాలు
అందరూ రోజువారీ జీవనంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. ప్రతీరోజు 30 – 45 నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయామం చేయాలి. యోగా, ప్రాణాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సరైన రీతిలో ఉండే ఆహారం తీసుకోవాలి. మద్యపానం, సిగరెట్లకు దూరంగా ఉండాలి. చిన్న వయస్సులోనే గుండెపోటు రావడానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. జీవనశైలిలో వచ్చే మార్పులు, ఒత్తిడి ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. కనీసం ఆరు నెలలకోసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఛాతిలో నొప్పి, గుండె సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే నిపుణులను సంప్రదించడం మంచిది. – డాక్టర్ సీతారామ్,
కార్డియాలజిస్ట్, జిల్లా జనరల్ ఆస్పత్రి
గుండె పనిచేయడం హఠాత్తుగా ఆగిపోవడాటాన్ని వైద్య పరిభాషలో కార్డియాక్ అరెస్ట్ అంటారు. స్పృహ కోల్పోవడం, స్పందించకపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్‌గా భావించాలి. మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడాన్ని హర్ట్‌స్ట్రోక్ అని చెబుతారు. అయితే సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు వస్తుంది. రక్తం గడ్డ కట్టినప్పుడు గుండెకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయి గుండెపోటుతో మరణం ఎదురవుతుంది. అనారోగ్య జీవనశైలి, పెరిగిన ఒత్తిళ్లే గుండె సంబంధిత మరణాల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సమతుల ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, సరైన జీవన విధానం పాటించకపోవడం వంటివి ఇందుకు కారణమవుతాయని చెబుతున్నారు.


