నిలిచిపోయిన అద్దె బస్సులు | - | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన అద్దె బస్సులు

Sep 11 2026 9:52 AM | Updated on Sep 11 2026 9:52 AM

సత్తుపల్లిటౌన్‌: బస్సు నిండినా, మరింత మందిని ఎక్కించుకోవాలంటూ స్టాప్‌లు పెంచడమే కాక అత్యధిక ఆదాయం తేవాలని ఒత్తిడి చేస్తున్నారంటూ సత్తుపల్లి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు గురువారం ఆందోళనకు దిగారు. తెల్లవారుజామునే ఆందోళన చేపట్టగా డిపో నుంచి వెళ్లాల్సిన 54 బస్సులు నిలిచిపోయాయి. దీంతో మధిర, కొత్తగూడెం, ఖమ్మం డిపోల బస్సులను అధికారులు అవసరమైన రూట్లలో పంపించారు. అనంతరం డీఎం లక్ష్మీనారాయణ అద్దె బస్సు యజమానులు, డ్రైవర్లతో చర్చించి అంతా కలిసి సంస్థ అభివృద్ధికి పనిచేయాలని నచ్చచెప్పడంతో నిరసన విరమించగా మధ్యాహ్నం బస్సులు మొదలయ్యాయి. అద్దె బస్సుల యజమానులు వనమా శ్రీనివాసరావు, పుల్లా సుబ్బారావు, పి.కేశవ, సీహెచ్‌.కిషోర్‌, సూర్యనారాయణ, వై.నాగరాజు, డ్రైవర్లు రవి, రమేష్‌, వాసు, అక్రమ్‌, అవినాష్‌ పాల్గొన్నారు.

పెద్దాస్పత్రిలో ఉచిత

గుండె చికిత్స శిబిరం

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గురువారం చిన్న పిల్లలకు ఉచిత గుండె చికిత్స శిబిరం నిర్వహించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే), హైదరాబా ద్‌లోని అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యాన ఈ శిబిరం నిర్వహించగా 0–18 ఏళ్ల వయస్సు పిల్లలు 62 మంది హాజరయ్యారని డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. వీరిని పరీక్షించిన నిపుణుల బృందం ముగ్గురికి మేజర్‌, 11 మందికి మైనర్‌ సర్జరీలు అవసరమని గుర్తించారన్నారు. రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఆదాయ ధ్రువపత్రంతో జూబ్లీ హిల్స్‌ అపోలో మెడికల్‌ కాలేజీలో సంప్రదిస్తే, ఉచితంగా గుండె శస్త్రచికిత్స చేస్తారని తెలిపారు. ప్రముఖ వైద్యులు సుజాతా పాటీల్‌, సునీల్‌కుమార్‌, అనుపమ పాటేల్‌ పరీక్షలు చేయగా, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నరేందర్‌, అధికారులు బాబురత్నాకర్‌, వేణుమాధవరావు, లక్ష్మీనారాయణ, శ్రీకాంత్‌, ప్రకాష్‌, రవి, ప్రవీణ్‌కుమార్‌, సతీష్‌ పాల్గొన్నారు.

సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

భద్రాచలంటౌన్‌: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సిద్ధమవుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ సూచించారు. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ ఆధ్వర్యాన హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో ఎనిమిది నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై, 21–32 ఏళ్ల వయస్సు, రూ.3 లక్షల్లోపు వార్షిక ఆదాయం కలిగిన అభ్యర్థులు ఈనెల 23 సాయంత్రంల్లోపు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఈనెల 27న స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించి, శిక్షణకు ఎంపిక చేస్తామని పీఓ తెలిపారు.

రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలకు బాలికల జట్టు ఎంపిక

కల్లూరు రూరల్‌: రాష్ట్ర స్థాయి ఖో–ఖో పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి ఖమ్మం బాలికల జట్టును గురువారం ఎంపిక చేశారు. కల్లూరులోని మినీ స్టేడియంలో జరిగిన ఎంపిక పోటీలకు 101 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబర్చిన గొంది మౌనిక, జమిలి రవళిక, గుండు రాధిక, గోనె శ్రావణి, కడారి భవాని, ధరావత్‌ ప్రవళిక, ఊకే మాధవి, కారం సమ్మక్క, వెంకటలక్ష్మి, శీలం తేజశ్రీ, మోకాళ్ల కావ్య, షేక్‌ సాదికతో జట్టును ఖరారు చేశారు. ఈ జట్టు 17న సరూర్‌నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు. ఖో–ఖో అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీరరాఘవయ్యతో పాటు కాటేపల్లి కిరణ్‌, మట్టూరి జనార్దన్‌, ఈ.నరసయ్య, ఎస్‌.రామారావు, ఎస్‌.ప్రసాద్‌, బి.బీమా, పి.సతీష్‌ కుమార్‌, కె.తులసి, రమాదేవి, త్రివేణి పాల్గొన్నారు.

చెల్లని చెక్కు కేసులో జైలుశిక్ష

ఖమ్మం లీగల్‌: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో నాలుగు కేసుల్లో ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బిక్కం రజిని గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం కవిరాజునగర్‌కు చెందిన రావూరి వెంకటరంగారావు వద్ద ముదిగొండ మండలం మల్లారానికి చెందిన నాదెండ్ల వరప్రసాదరావు 2016 అక్టోబర్‌లో రూ.15లక్షల అప్పు తీసుకున్నాడు. ఆతర్వాత 2019 సెప్టెంబర్‌లో వేర్వేరు తేదీల్లో నాలుగు చెక్కులు ఇచ్చాడు. కానీ ఆయన ఖాతా బ్లాక్‌ చేయడంతో చెక్కులు బౌన్స్‌ కాగా, వెంకటరంగారావు న్యాయస్థానంలో ప్రైవేట్‌ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం వరప్రసాదరావుకు నాలుగు కేసుల్లో ఏడాది జైలు, మరో కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement