ఖమ్మం సహకారనగర్: వానాకాలం సీజన్‌లో సాగు చేస్తున్న వరి ధాన్యం కొనుగోళ్లకు వచ్చేనెల 1 నుంచి కేంద్రాలు ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన సంబంధిత శాఖల అధికారులు, ధాన్యం రవాణా కాంట్రాక్టర్లు, గోదాముల నిర్వాహకులతో సమావేశమయ్యారు. జిల్లాలో సుమారు 2.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా కేంద్రాలు, గోదాములు, రవాణా ఏర్పాట్లు ముందుగానే చేయాలని సూచించారు. అక్టోబర్ 1 నుంచి అన్ని కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేకాక రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి, నిర్దేశిత తేమ శాతం వచ్చాకే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పంచాయతీ నుంచి సిబ్బందిని నియమించడమే కాక కేంద్రాల ఇన్‌చార్జిలకు నాణ్యత గుర్తింపు, రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.
సన్న రకాలకు రూ.500 బోనస్..
ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధర చెల్లించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తామని పేర్కొన్నారు. కేంద్రాల ఎంపిక, గోదాముల గుర్తింపు, ధాన్యం రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ పరికరాల బిగింపుపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో సహాయ పౌర సరఫరాల అధికారి మల్లికార్జునబాబు, జిల్లా వ్యవసాయ, సహకార శాఖల అధికారులు పుల్లయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి


