ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీలు కుమ్మకై ్క దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని, ఈక్రమాన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు, ప్రజాప్రతినిధులను కించపరిచేలా వ్యవహరించడం అత్యంత హేయమని కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులునూతి సత్యనారాయణ గౌడ్, నాగండ్ల దీపక్‌చౌదరి పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్య సమాజం తలదించుకునేలా స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అంతేకాక నిరసన తెలిపేందుకు వెళ్లిన సామాజిక వర్గం ప్రతినిధులు తిరిగి ప్రదేశాన్ని పసుపు నీళ్లతో కడగడం మరింత అమానవీయమని తెలిపారు. కాగా, వారం రోజులుగా జిల్లా బీఆర్‌ఎస్ నిర్వహించిన నిరసనలకు ప్రజల నుంచి స్పందన రాలేదని ఎద్దేవా చేశారు. ఈమేరకు బీఆర్‌ఎస్, బీజేపీ శైలిని నిరసిస్తూ శుక్రవారం ఉదయం ఖమ్మంలోని పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, నాయకులు కొత్త సీతారాములు, దొబ్బల సౌజన్య, బొడ్డు బొందయ్య, మొక్క శేఖర్‌గౌడ్, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, తూములూరి లక్ష్మీనరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


