డంప్ యార్డులో పేరుకుపోతున్న చెత్త
తడి, పొడిగా వేరు చేయకుండానే సేకరణ
నిరుపయోగంగా మారిన కంపోస్ట్ షెడ్లు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా మార్చేలా చేపట్టాల్సిన స్వచ్ఛ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో నామమాత్రంగానే అమలవుతున్నాయి. ఇంటింట తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలనే నిబంధనను అధికారులు, సిబ్బంది గాలికి వదిలేశారు. ఫలితంగా రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన కంపోస్ట్ షెడ్లు అలంకార ప్రాయంగా మారగా, సేకరించిన వ్యర్థాలన్నింటినీ డంపింగ్ యార్డులో కుప్పగా పోస్తుండడంతో స్వచ్ఛ భారత్ ఉద్దేశానికి గండి పడుతోంది. మరోపక్క యార్డులో పేరుకుపోతున్న చెత్త గుట్టలు కరిగేదెన్నడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే డబ్బాలో..
నగరంలోని డివిజన్లలో రోజు విడిచి రోజు ఇంటింటా చెత్త సేకరణ జరుగుతోంది. రోజుకు 190 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరిస్తుంగా, ఇందులో తడి చెత్త 105 మెట్రిక్ టన్నులు, పొడి చెత్త 70 మెట్రిక్ టన్నులు, ఇతర వ్యర్థాలు 15మెట్రిక్ టన్నులు ఉంటాయని అంచనా. అయితే, తడి చెత్త(వంటగది వ్యర్థాలు, కూరగాయలు), పొడి చెత్త(ప్లాస్టిక్, కాగితాలు)ను నుంచి వేర్వేరుగా స్వీకరించాల్సి ఉన్నా వాహనాల్లో అంతాకలిపి పోస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించి చెత్తను వేర్వేరుగా సేకరించాల్సిన సిబ్బంది ఆ పని వదిలేశారు.
దుమ్ముతో నిండిపోతున్న షెడ్లు
తడి చెత్త నుంచి సేంద్రీయ ఎరువు తయారీకి డంపింగ్ యార్డ్‌లో రూ.లక్షలు వెచ్చించి కంపోస్ట్ షెడ్లు నిర్మించారు. కానీ తడి, పొడి చెత్త వేరుగా రాకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఎరువు తయారీ నిలిచిపోయి, నిర్మాణాలు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. రాష్ట్ర, కేంద్ర స్వచ్ఛ అధికారులు వచ్చిన సమయంలో మాత్రం కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నామని చెప్పేలా షెడ్‌లో అప్పటికప్పుడు వ్యర్థాలు వేస్తున్నారనే విమర్శలున్నాయి.
యార్డులో చెత్త కొండలు..
నగరం నుంచి సేకరించిన టన్నుల కొద్దీ వ్యర్థాలను నేరుగా డంపింగ్ యార్డుకు తరలించి గుట్టగా పోస్తున్నారు. తద్వారా రీసైక్లింగ్ ప్రక్రియకు విఘాతం ఏర్పడడమే కాక ప్లాస్టిక్ వ్యర్థాలు తడి చెత్తతో కలిసి కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. దుర్వాస న, పొగతో తాము వ్యాధుల బారిన పడే ప్రమాదముంద ని పరిసర ప్రాంతాల ప్రజలు పలుమార్లు ఆందోళనలు చేసినా అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి సిబ్బందితో ఎలాంటి మార్పు రావడం లేదు. కాగా, తడి, పొడిచెత్త వేర్వేరుగా సేకరణ, సేంద్రియ ఎరు వు తయారీ అంశంపై కేఎంసీ అధికారులను వివరణ కోరగా.. ప్రస్తుతం తడి,పొడి వ్యర్థాలను కలిపే సేకరి స్తున్నా త్వరలోనే ఏ రోజు వ్యర్థాలను ఆరోజే శుభ్రం చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. రూ.9కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు టెండర్ల దశలో ఉందని తెలిపారు.


