ఖమ్మం స్పోర్ట్స్: అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపికకు ఈనెల 13న పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, ఎం.డీ.షఫీక్ అహ్మద్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అండర్–14 బాలబాలికలతో పాటు అండర్–16, 18, 20, పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, ఇక్కడ ఎంపిక చేసే జట్లు 26, 27వ తేదీల్లో హనుమకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు.
మూడు జిల్లాల
అవసరాలకు యూరియా
చింతకాని: మూడు జిల్లాల అవసరాలకు గాను చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పా యింట్‌కు ఐపీఎల్ కంపెనీకి చెందిన 1,340.01 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో 740.01 మెట్రిక్ టన్నులు ఖమ్మం జిల్లాకు, 300 మె.టన్నులు భద్రాద్రి జిల్లాకు, 200 మె.టన్నుల ను మహబూబాబాద్ జిల్లాకు కేటాయించారు. మరో ఇంకో 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు.
భాష, యాస పరిరక్షణకు కాళోజీ కృషి
ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ వైతాళికుడు, ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు సమాజంలోని అన్యాయాలు, అక్రమాలను తన కలం బలం ద్వారా ఎండగట్టారని ట్రెయినీ కలెక్టర్ పారస్‌కుమార్ తెలిపారు. కాళోజీ జయంతి, తెలంగాణ దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించారు. తొలుత కాళోజీ చిత్రపటానికి పారస్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించాక మాట్లాడారు. తెలంగాణ భాష, యాస, సంస్కతి పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాచైతన్యమే ఊపిరిగా జీవించిన కాళోజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని, ఆయన చూపిన బాటలో, అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. గిరిజనాభివృద్ధి శాఖ డీడీ ఫిరంగి, ఉద్యోగులు పరుశురాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పట్టు సాగుతో
రైతుల ఆర్థికాభివృద్ధి
ఎర్రుపాలెం: పట్టు పురుగుల పెంపకం, మల్బ రీ సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా పట్టు పరిశ్రమల శాఖాధికారి అనసూయ తెలిపారు. ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో ‘మేరా రేషం – మేరా అభిమాన్‘ కార్యక్రమంలో భాగంగా బెంగళూరులోని కేంద్ర పట్టు పరిశ్రమ మండలి, రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యాన బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన మల్బరీ సాగు ఎంచుకుంటే లాభాలు ఉంటాయని తెలిపారు. అనంతరం నారాయణపురంలో మల్బరీ క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిల్క్ బోర్డ్ అధికారి డాక్టర్ జి.సుబ్రహ్మణ్యంతో పాటు ఏడీఏ వాణిశ్రీ, మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, హెచ్‌ఈఓ కామేశ్వరరావు, ఏఎస్‌ఓ దేబరాజు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఖమ్మం మామిళ్లగూడెం: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఈమేరకు ఎన్నికల అధి కారిగా సీపీఓ ఏ.శ్రీనివాస్‌ను నియమించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటర్ల జాబితా విడుదల చేయనుండగా, ఈనెల 15వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం 19వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆతర్వాత 24వ తేదీన నామినేషన్లు స్వీకరించి, 25న పరిశీలించాక 26న ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. అదేరోజు పోటీదారుల జాబితా ప్రకటించనున్నారు. ఆపై ఎన్నికలు అవసరమైతే అక్టోబర్ 4న ఉదయం 8నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ నిర్వహించాక ఓట్లు లెక్కించి విజేతల వివరాలు వెల్లడిస్తారు.


