పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక

Sep 10 2026 12:27 AM | Updated on Sep 10 2026 12:27 AM

● తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు ● కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

● తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు ● కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

ఖమ్మం రాపర్తినగర్‌: జిల్లాలో గుర్తించిన పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఏ.వాణీప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, డీఎఫ్‌ఓ అనూజ్‌ అగర్వాల్‌తో కలిసి అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, మరుగుదొడ్లు, భద్రత, సమాచార కేంద్రాలు ఏర్పాటుచేస్తే రాకపోకలు పెరుగుతాయని వివరించారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జన ప్రాంతాల ఎంపికపై ప్రత్యేక దృష్టి

ఖమ్మంగాంధీచౌక్‌: జిల్లాలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన అధికారులు, గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున భక్తుల మనోభవాలను పరిగణనలోకి తీసుకుని నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే, నిమజ్జనం రోజున రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసి ట్రాఫిక్‌ మళ్లింపుపై ప్రజలకు సూచనలు చేయాలని తెలిపారు. అంతేకాక అవసరమైన చోట రహదారుల మరమ్మతు, విద్యుత్‌ సరఫరా, నిమజ్జన పాయింట్ల వద్ద వసతుల కల్పన, గజ ఈతగాళ్ల నియామకం, మెడికల్‌ క్యాంపుల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లా అటవీ అధికారి అనూజ్‌ అగర్వాల్‌, విద్యుత్‌ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ రామారావు, స్తంభాద్రి ఉత్సవ సమితి బాధ్యులు వినోద్‌ లహోటి, జి.విద్యాసాగర్‌, కె.జయపాల్‌ రెడ్డి, కన్నం ప్రసన్నకృష్ణ, అల్లిక అంజయ్య, ఎం.శ్రీహరి, డౌలే సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement