ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత సీజన్‌లో సాగు చేసిన పత్తి పంట దిగుబడి మొదలైంది. జూన్ ఆరంభంలో వేసిన పత్తి పంట ఇప్పుడిప్పుడే చేతికందుతోంది. అంతేకాక సీజన్ ఆరంభంలో ధర సైతం ఆశాజనకంగా ఉంది. ఈ సీజన్‌లోనే తొలిసారిగా బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బోనకల్ మండలం ముష్టికుంట్ల రైతు డొప్ప ప్రసాద్ 38 బస్తాల కొత్త పత్తి విక్రయానికి తీసుకొచ్చాడు. గరిష్టంగా క్వింటాకు రూ.9,018 చొప్పున ఎంకే అగ్రి ట్రేడర్స్ మన్నెం కృష్ణ కంపెనీ తరఫున కొనుగోలు చేశారు. అలాగే, పాత పత్తికి రూ.9,200 ధర పలికింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి రూ.8,667 కనీస మద్దతుగా ధరగా ప్రకటించినా.. అంతకు మించి ధర పలుకుతుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత ఏడాది సీజన్‌లో రూ.6 వేల ధర దాటకపోగా, ప్రస్తుతం ఆరంభంలోనే రూ.9 వేలు దాటడం విశేషం.
ఖమ్మం మార్కెట్‌లో క్వింటాకు రూ.9,018


