నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అమలు చేయకపోవటంపై మండల ప్రత్యకాధికారి, డీఐఈఓ కె.రవిబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని బోదులబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అయితే, మెనూ ప్రకారం కాకుండా పప్పుచారు వడ్డించడంపై హెచ్‌ఎం, ఉపాధ్యాయుల నుంచి వివరాలు ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంఈఓ బి.చలపతిరావు పాల్గొన్నారు. అనంతరం నేలకొండపల్లి జూనియర్ కాలేజీని తనిఖీ చేసిన డీఐఈఓ రవిబాబు విద్యార్థులకు కిట్లు అందజేశాక అధ్యాపకులతో సమావేశమయ్యారు. బోధనలో మార్పులు, విద్యార్థుల హాజరు పెంపు, ఫలితాల సాధనపై సూచనలు చేశారు. ప్రిన్సిపాల్ ఎల్.వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.


