ఫలితంగా వ్యవసాయంపై నీలినీడలు సాగైన పంటలు చేతికి రావడంపైనా అనుమానాలు
ఖమ్మంవ్యవసాయం: పైకి చూస్తే ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నా... ఆ స్థాయిలో వర్షం లేక జల్లులకే పరిమితమవుతోంది. వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన జూలైతో పాటు ఈ నెలలో కూడా సాధారణ స్థాయిలోనూ నమోదు కావడం లేదు. జూన్ సాధారణ వర్షపాతం 131.2 మి.మీ.కు. 168.9 మి.మీ. నమోదైంది. దీంతో జిల్లా రైతులు మెట్ట పంటలను సాగు చేశారు. ఇక జూలైకి వచ్చేసరికి 240.9 మి.మీ.ల సాధారణ వర్షపాతానికి గాను కేవలం 90.7 మి.మీ. నమోదైంది. ఈనెలలో 20వ తేదీ వచ్చినా భారీ వర్షం జాడ లేకపోవడం పంటల సాగుపై ప్రభావం చూపిస్తోంది.
18 మండలాల్లో లోటు
జిల్లాలోని 21 మండలాలకు గాను కారేపల్లి, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండల్లి, ముదిగొండ, చింతకాని, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, ఏన్కూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, తల్లాడ, వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. ఇందులో ఎర్రుపాలెం మండలం అధిక లోటు వర్షపాతం జాబితాలో చేరింది. కామేపల్లి, ఖమ్మం రూరల్, కల్లూరు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.
లక్ష్యానికి దూరంగా..
వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాలో పంటల సాగు లక్ష్యాలను చేరడం లేదు. ఈ ఏడాది వానాకాలంలో అన్ని పంటలు కలిపి 5,53,329 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. అయితే మెట్ట పంటలైన పత్తి, పెసర పంటలు జూన్‌లో కురిసిన వర్షాలతో లక్ష్యాన్ని దాటినా.. వరి మాత్రం వెనకబడింది. జిల్లాకు ప్రధాన నీటి వనరైన సాగర్ నుంచి నీరు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల వరి సాగు చేసే భూములు బీళ్లుగా కనిపిస్తున్నాయి. దాదాపు 3 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని భావిస్తూ కేవలం 1.60 లక్షల ఎకరాలకే పరిమితమైంది. జిల్లాలో ఇప్పటి వరకు అన్నీ కలిపి 4,29,213 ఎకరాల్లో పంటలు సాగు చేశారు.
పంటలకు నీరెలా?
ప్రస్తుతం సాగులో ఉన్న పంటల పరిస్థితి కూడా అంతగా ఆశాజనకంగా లేదు. వర్షాలు లేక పత్తి వడబడుతుంది. పూత, కాత దశకు వచ్చిన ఈ సమయాన వర్షాలు, నీటి తడులు అవసరం ఉంటాయి. కానీ వర్షాలు లేకపోగా పత్తి పైర్లు వడబడుతున్నాయి. ఇక బోర్లు, జలాశయాల కింద సాగు చేసిన వరి కూడా ఆశాజనకంగా లేదు. పూత, కాత దశలోని పెసర మాత్రం కొంత మెరుగ్గా ఉందని చెబుతున్నారు. కాగా, వరి, పత్తి సాగు చేసిన రైతులు ఇప్పటికే పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టగా, వరుణుడి కరుణ లేకపోవడంతో భవిష్యత్‌పై బెంగగా ఎదురుచూస్తున్నారు.
మేఘాలు మెరుస్తున్నా కురవని వర్షం


