ప్రతీ అంగుళాన్ని కొలిచి టైటిల్ ఇస్తాం
ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా హక్కులు
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షిప్రతినిధి, ఖమ్మం /సత్తుపల్లి: గత ప్రభుత్వ హయాంలో భూముల సర్వే సరిగ్గా చేయకపోవడం, భూమి లేని వారికి రైతుబంధు కోసం పట్టా పుస్తకాలు జారీ చేయడంతో ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సత్తుపల్లి మండలం బేతుపల్లిలో జరుగుతున్న భూముల రీసర్వేను గురువారం ఆయన పరిశీలించగా వివరాలను కలెక్టర్ దివాకర టీ.ఎస్. వివరించారు. అనంతరం నారాయణపురంలో మంత్రి అధికారులతో సమీక్షించడంతో కాక రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బేతుపల్లి రెవెన్యూ పరిధిలో 12,047 ఎకరాల భూమికి గాను ప్రభుత్వ భూమి 2,026 ఎకరాలు ఉందని తెలిపారు. గత 25 రోజులుగా 6వేల ఎకరాల్లో రీ సర్వే పూర్తయిందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు 990 ఎకరాల పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఆతర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సమస్యలు ఎదురుకాగా సాగు చేసుకుంటున్న రైతులకు ఇప్పటికీ పట్టా పుస్తకాలు అందలేదని తెలిపారు. అయితే, తాము మాత్రం ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఏ రైతుకూ నష్టం జరగ కుండా.. భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రతీ అంగుళాన్ని కొలిచి టైటిల్‌డీడ్ జారీ చేస్తామని, భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే భూభారతి లక్ష్యమని పేర్కొన్నారు.
నివాస ప్రాంతాల సర్వే..
వ్యవసాయ భూములతోపాటు నివాస ప్రాంతాల భూములను కో ఆర్డినేట్లు, మ్యాప్‌లతో సహా సర్వే చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈక్రమాన రైతులకు డిజిటల్ కో ఆర్డినేషన్ మ్యాప్‌తో కూడిన పక్కా హక్కుల టైటిల్ డీడ్ ఇస్తామన్నారు. గతంలో చట్టం తీసుకొచ్చి మూడేళ్లయినా నిబఽంధనలు అమలు చేయలేని వాళ్లు.. ఇప్పుడు మూడు నెలల్లోనే నిబంధనలు తీసుకొచ్చిన తమ ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. 22ఏ ప్రొహిబిటెడ్ జాబితా పేరుతో అమాయక ప్రజలను అడ్డు పెట్టుకుని వేలాది ఎకరాల అక్రమ ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకోవాలని పగటి కలలు కుంటున్నారని బీఆర్‌ఎస్ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, రెవెన్యూ, సర్వే అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అభినందించారు. రైతులకు ఏమైనా అభ్యంతరాలు, సందేహాలు, లోపాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకు రావాలని మంత్రి సూచించారు. పొలాలకు వెళ్లే దారులకు పట్టాలు ఇవ్వొద్దని సూచించిన మంత్రి, చెరువులను పరిరక్షించాలని తెలిపారు. కాగా, అసైన్డ్ భూముల పట్టాలు ఎవరూ కోల్పోరని స్పష్టం చేశారు. భూభారతి చట్టాన్ని తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం తీసుకొచ్చిందని తెలిపారు.
క్షేత్రస్థాయిలో భూసమస్యల పరిష్కారం
మంత్రి ఆదేశాలతో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. ఈ సందర్భంగా బేతుపల్లి, నారాయణపురం గ్రామాల రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్, ఏసీపీ వసుంధరయాదవ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్‌రావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.


