● పోలీసు కమిషనర్ సునీల్‌దత్
ఖమ్మంక్రైం: వచ్చేనెల 12న జాతీయ లోక్ అదాలత్ జరగనున్నందున పెండింగ్ కేసుల్లో రాజీ పడదగినవి గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఆదేశించారు. ఖమ్మం నుంచి జిల్లాలోని అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అన్ని స్టేషన్ల పరిధిలో రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించే ప్రయత్నం చేయాలని తెలిపారు. లోక్ అదాలత్‌లో పరిష్కారం ద్వారా కలిగే ప్రయోజనాలపై ఇరువర్గాలకు అవగాహన కల్పిస్తే ఫలితం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు మహేష్, నరసింహరావు, సీఐ సర్వయ్య పాల్గొన్నారు.
బియ్యం పంపిణీలో
ఇబ్బంది రానివ్వొద్దు
తిరుమలాయపాలెం: ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్నందు లబ్ధిదారులకు ఇబ్బందులు రాకుండా డీలర్లు వ్యవహరించాలని డీసీఎస్‌ఓ చందన్‌కుమార్ ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలంలో గురువారం పర్యటించిన ఆయన కాకరవాయి, సోలిపురం, సుబ్లేడులోని రేషన్ దుకాణాల్లో నిల్వలను తనిఖీ చేశారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా డీలర్లు సమయపాలన, పారదర్శకత పాటించాలని సూచించారు. బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తనిఖీల్లో సివిల్ సప్లయీస్ డీటీ విజయబాబు పాల్గొన్నారు.
రేపు ఎస్‌జీఎఫ్ సమావేశం
ఖమ్మం స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యాన జిల్లా పాఠశాలల క్రీడా సంఘం సమావేశం ఈనెల 22న జరగనుందని కార్యదర్శి వై.రామారావు తెలిపారు. కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 3గంటలకు మొదలయ్యే ఈ సమావేశానికి అన్ని మండలాల క్రీడా కార్యదర్శులు, పీఈటీలు, పీడీలు హాజరుకావాలని సూచించారు. ఈ ఏడాది మండల స్థాయి పోటీల తేదీలు ఖరారు, రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి క్రీడాకారుల ఎంపిక తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.
గురుకుల కళాశాలలో తనిఖీ
సత్తుపల్లి: సత్తుపల్లి గుడిపాడు రోడ్డులోని తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలను గురువారం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎండీ.ముజాహిద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించిన ఆయన తరగతి, వసతిగదులు, వంటశాలను పరిశీలించారు. అలాగే, బోధన, మెనూ అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధ్యాపకులకు సూచించారు. తనిఖీల్లో ప్రిన్సిపాల్ కె.వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు ఆస్పత్రిలో డీఎంహెచ్‌ఓ..
కల్లూరు రూరల్: కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిని డీఎంహెచ్‌ఓ రామారావు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల నిర్వహణ, ఫార్మసీ గదిని పరిశీలించి మాట్లాడారు. గర్భిణుల నమోదు 100శాతం పూర్తిచేసి ప్రసవం అయ్యేవరకు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే, వైద్యసేవలు, గ్రామాల్లో సీజనల్ వ్యాధుల కట్టడికి నిర్వహించాల్సిన డ్రై డేపై సూచనలు చేశారు. వైద్యాధికారి నవ్యకాంత్, ఉద్యోగులు పాల్గొన్నారు.
మరో 3,115 మె.టన్నుల యూరియా
చింతకాని: వానాకాలం సీజన్‌లో పంటల సాగు పెరుగుతుండడంతో రైతుల అవసరాల నిమి త్తం యూరియా కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు గత పది రోజులుగా వివిధ కంపెనీల యూరియా చేరుతుండగా, ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు చేరవేస్తున్నారు. ఈమేరకు గురువా రం డీఏపీ 1,680మెట్రిక్ టన్నులు, 20.20.0.13 ఎరువు 935 మె.టన్నులు, పొటాష్ 385 మె.టన్నులు, జిప్‌మైట్ ప్లస్ 115.500 మె. టన్నులు చేరగా మూడు జిల్లాలకు కేటాయించినట్లు డీఏఓ ధనసరి పుల్లయ్య తెలిపారు.


