ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల బృందం గురువారం పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖల(సీపీహెచ్‌ఈఈఓ) సలహాదారు డాక్టర్ ఎం.దినదయాళన్, తెలంగాణ అమృత్ నోడల్ అధికారి గౌరవ్ ఖన్నా నేతృత్వాన వచ్చిన బృందం ఖమ్మం పబ్లిక్ హెల్త్ డివిజన్, కేఎంసీ పరిధిలో అమృత్–2.0 పనుల పురోగతిని సమీక్షించింది. ఈ సందర్భంగా లకారం వద్ద అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, సీవరేజ్ నెట్‌వర్క్ సాంకేతిక పురోగతిపై ఆరా తీశాక అల్లీపురంలో 24గంటల పాటు తాగునీరు అందించే పథకం లేఔట్, ఆపరేషనల్ విధానాన్ని పరిశీలించారు. ఖమ్మంలో 24 గంటల సరఫరా, డ్రింక్ ఫ్రం ట్యాప్ పథకాల అమలుపై అధికారులను అభినందించారు. అలాగే, ధంసలాపురం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణ పనులు, పుట్టకోటలో 9.5 ఎంఎల్‌డీ సామర్థ్యం గల సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ) నిర్మాణ స్థలం పరిశీలించి సూచనలు చేశారు. అంతేకాక అమృత్ మిత్ర పథకంలో నీటి నిర్వహణలో లయ స్వయం సహాయక సంఘం సభ్యులు చూపుతున్న చొరవను అభినందించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం సభ్యులు తమ విజయాలను వివరించారు. పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఈ వి.రంజిత్, కేఎంసీ, డీఈఈలు, ఏఈఈలు, ఎస్‌హెచ్‌జీల ప్రతినిధులు పాల్గొన్నారు.
‘అమృత్’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం


