ఉపాధి కోసం పట్టణాలకు..
జిల్లాలో 1,57,854 ఓట్ల తొలగింపు
ఇందులో వలస వెళ్లిన వారివే 1,01,549
ఖమ్మం నియోజకవర్గంలో
అత్యధికంగా ఈ తరహా ఓటర్లు
కన్నతల్లి!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్)లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1,57,845 ఓట్లు తొలగిపోనున్నాయి. అయితే, వీటిని పరిశీలిస్తే రెండేసి చోట్ల ఓటు ఉండి.. ఒకే చోట ఖరారు చేసుకున్న వారి దరఖాస్తులు 1,01,549 ఉన్నాయి. అంటే తొలగించే ఓట్లలో 64 శాతం వరకు ఇవే కావడం గమనార్హం. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉపాధి, వ్యాపారాల నిమిత్తం పట్టణానికి వచ్చిన వారు ఓటు హక్కు స్వగ్రామాల్లోనే కొనసాగించుకోవాలనే నిర్ణయం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రభావం జిల్లా కేంద్రంగా ఉన్న ఖమ్మం నియోజకవర్గంతోపాటు మధిర, సత్తుపల్లి, వైరా, పాలేరు నియోజకవర్గ కేంద్రాలపై పడింది.
వలస ఓటర్ల ప్రభావం
జిల్లాలో వలస ఓటర్ల ప్రభావంతో 1,01,549 ఓట్లు తొలగింపునకు రంగం సిద్ధమైంది. మొత్తం తొలగింపునకు గురయ్యే 1,57,845 ఓట్లలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లే అత్యధికంగా ఉన్నాయి. ఇప్పటివరకు పలువురికి అటు పల్లె, ఇటు పట్నంలో ఓటుహక్కు ఉండగా ‘సర్’లో భాగంగా ఇలాంటివి తొలగిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో చాలామంది స్వగ్రామాలకే మొగ్గుచూపారు. ఇప్పటి వరకు ప్రతీ ఎన్నికలో పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల సంఖ్య ఎక్కువగా నమోదయ్యేది. ప్రస్తుతం ఓటర్ల పరంగా ఎక్కువగానే ఉన్నా.. అత్యధికంగా తొలగింపునకు గురయ్యే ఓట్లు కూడా పట్టణ, మండల కేంద్రాల్లోనే ఉండనున్నాయి.
ఖమ్మంలో 80వేల ఓట్లు
జిల్లావ్యాప్తంగా తొలగించే ఓట్లను పరిశీలిస్తే.. ఒక్క ఖమ్మం నియోజకవర్గ పరిధిలోనే 80,663 ఓట్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా తొలగించే ఓట్లలో ఇవి 51 శాతానికన్నా పైగానే నమోదయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వచ్చిన వారు ఖమ్మంలోనే ఎక్కువగా ఉండటంతో ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఓట్లు తొలగింపునకు గురి కానున్నాయి. ఇందులో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 56,974 ఓట్లు ఉన్నాయి.
అక్కడా అంతే..
జిల్లా కేంద్రమే కాక సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల్లోనూ వలస ఓటర్లు తమ స్వగ్రామాలకే ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాల్లోనే ఓటుహక్కు కొనసాగిస్తూ, పట్టణాల్లోని అదనపు ఓటు తొలగించుకుంటున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. పాలేరు నియోజకవర్గ పరిధి ఖమ్మంరూరల్‌లో 7,158 మంది ఓట్లు, మధిర నియోజకవర్గ కేంద్రంలో 3,861, వైరా నియోజకవర్గ కేంద్రంలో 3,481, సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో 3,675 ఓట్లు తగ్గనుండడం ఓటర్లు తమ గ్రామాలకు ఇచ్చిన ప్రాధాన్యతను తెలియజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా తొలగించే ఓట్లు 1,57,845 ఉండగా.. అందులో ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఓట్లే 1,05,910 (67శాతం) ఉన్నాయి. ఇక శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు 75,149గా ఉన్నాయి.
పల్లె ప్రాంతాల నుంచి పలువురు పట్టణాలు, మండల కేంద్రాలకు జీవనోపాధి కోసం వస్తుంటారు. ఈక్రమాన పలువురికి స్వగ్రామాల్లో ఇల్లు, ఇతర ఆస్తులు, రేషన్‌కార్డులు ఉన్నాయి. వీరు బతుకుదెరువు కోసం పట్టణాల్లో ఉంటున్నా సొంత గ్రామాలపై మమకారం మాత్రం వీడలేదు. ‘సర్’లో ఇలాంటి వారు ఎక్కువగా స్వగ్రామాల్లోనే ఓటు హక్కు కొనసాగిస్తూ, పట్టణ ప్రాంతాల్లోనూ నమోదు చేసుకున్న ఓటు తొలగించుకునేందుకు సిద్ధమయ్యారు.
స్వగ్రామాల్లో ఓటే ఖరారు చేసుకున్న పలువురు


