● నిబంధనలకు విరుద్ధంగా రుణాల మంజూరు నిజమేనని నిర్ధారణ ● టెస్కాబ్ విచారణ అనంతరం వేటు
సత్తుపల్లి: పీఎంఈజీపీ సబ్సిడీ రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలతో విచారణ అనంతరం అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఈమేరకు డీసీసీబీ సత్తుపల్లి బ్రాంచ్ మేనేజర్ జంగం కిషోర్‌ను సస్పెండ్ చేసినట్లు బుధవారం సీఈఓ వెంకటఆదిత్య వెల్లడించారు. రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని, పలువురు రుణాలు తీసుకుని యూనిట్లు ఏర్పాటుచేయకున్నా సబ్సిడీ మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలతో ‘సాక్షి’లో వరుస కథనాలు మంజూరయ్యాయి. గతనెల 25న ‘లేనిది ఉన్నట్టు.. కనికట్టు’ కథనంతో సత్తుపల్లి డీసీసీబీ బ్రాంచ్‌లో పీఎంఈజీపీ సబ్సిడీ రుణాల కుంభకోణం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆతర్వాత వరుసగా అంతా సర్దేస్తున్నారు!, తీసుకుంటున్నాం.. తప్పేంటి, సబ్సిడీ కుంభకోణంపై టెస్కాబ్ విచారణ, యూనిట్లు తాత్కాలికమేనా?! శీర్షికలతో వరుస కథనాలు రావడంతో అధికారులు స్పందించారు.
టెస్కాబ్ విచారణతో..
సబ్సిడీ రుణాల అవకతవకలపై ‘సాక్షి’ కథనాలతో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెస్కాబ్ విచారణకు ఆదేశించారు. టెస్కాబ్ అధికారులు డీసీసీబీ బ్రాంచ్‌లో రికార్డులనే కాక యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే, అధికారులు వస్తున్న సమాచారం రుణగ్రహీతలకు బ్యాంక్ అధికారులు చేరవేసి అప్పటికప్పుడు యూనిట్లు పెట్టించారనే అంశం కూడా ఆధారాలతో సహా ‘సాక్షి‘ బయట పెట్టింది. దీంతో సబ్సిడీ రుణాలకు సంబంధించిన 76 ఫైళ్లను టెస్కాబ్ డీజీఎం సంపత్‌కుమార్ హైదరాబాద్ తీసుకెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాక అవినీతి నిర్ధారణ కావడంతో బ్రాంచ్ మేనేజర్ కిషోర్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. సదరు అధికారి ములకలపల్లి బ్రాంచ్‌లో పని చేసినప్పుడు కూడా అవకతవకలకు పాల్పడి సస్పెన్షన్ గురైనట్లు తెలిసింది. కాగా, కొన్ని ఫైళ్లల్లో తహసీల్దార్ సంతకాలను కూడా ఫోర్జరీ చేశారనే ఆరోపణలు వస్తున్నందున రుణాల రికార్డులను మరింత లోతుగా పరిశీలించాలని పలువురు కోరుతున్నా.
థర్డ్ పార్టీ విచారణపైనా..
పీఎంఈజీపీ సబ్సిడీ రుణాలు మంజూరు అయ్యాక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న పోస్టల్ శాఖ అధికారులతో థర్డ్ పార్టీ విచారణ చేయిస్తారు. అంతా బాగుందని నివేదిక ఇస్తేనే సబ్సిడీ మంజూరవుతుంది. కానీ సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో యూనిట్లు లేకుండానే సబ్సిడీ మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం.


