● వేటగాళ్ల ఉచ్చుకు బలైన నవీన్ అంత్యక్రియలు పూర్తి ● నివాళులర్పించిన కలెక్టర్ దివాకర ● పాడె మోసిన వైరా ఎమ్మెల్యే, కొత్తగూడెం డీఎఫ్‌ఓ
కారేపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులకు మంగళవారం రాత్రి బలైన ఫారెస్టు బీట్ ఆఫీసర్ బానోతు నవీన్(36) మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండా గ్రామానికి బుధవారం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించగా నవీన్ అమర్‌రహే, అటవీశాఖ అమరవీరుడికి జోహార్లు అంటూ నినాదాలు చేయడమే కాక ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనుబంధాన్ని చాటుకున్నారు. అనంతరం కలెక్టర్ దివాకర టీ.ఎస్., వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, భద్రాద్రి డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్ తదితరులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను ఓదార్చారు. ఆతర్వాత నవీన్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే రాందాస్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ పాడె మోసి కడసారి వీడ్కోలు పలికారు.
వెంకిట్యాతండాలో విషాదఛాయలు
కారేపల్లి మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన బానోతు దేవ్లానాయక్ – వెంకిట్యాతండా సర్పంచ్ బానోతు బూలి చిన్నకుమారుడైన నవీన్ వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలోగా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా చేరుకుని కుటుంబీకులను ఓదార్చారు. ఏళ్లుగా రాజకీయ నేపథ్యం కలిగిన దేవ్లా – బూలి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, పెద్ద కుమారుడు లెనిన్ హైదరాబాద్ ఫార్మా కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. చిన్నకుమారుడైన నవీన్‌కు భార్య కవిత, ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, కారేపల్లి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీఓ రవీంద్రప్రసాద్, రెండు జిల్లాల ఉద్యోగులు, నాయకులు కూడా నవీన్ మృతదేహం వద్ద నివాళులర్పించారు.


