తొలి దశ ఎస్‌ఐఆర్
విజయవంతం
తాగునీటి వనరులను కాపాడుకోవాలి
ఓటరు జాబితా సవరణకు
మరో నెల అవకాశం
మీడియా సమావేశంలో
కలెక్టర్ దివాకర టీ.ఎస్.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆకాశం మేఘావృతమవుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడానికి ఎల్‌నినోప్రభావమే కారణమని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ‘సర్’ ప్రక్రియ, ఎల్‌నినో, జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితి, వ్యవసాయంపై ప్రభావం తదితర అంశాలపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశం మాట్లాడారు. రానున్న రెండు, మూడు నెలల్లో ఎల్‌నినో ప్రభావం మరింత అధికంగా ఉంటుందని.. ఆకాశంలో మేఘాలు ఏర్పడినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం తక్కువేనని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని తెలిపారు. మరోపక్క గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలమట్టం 6.5 నుంచి 8 అడుగుల మేరకు తగ్గగా, రానున్న నెలలో మరింతగా తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలకు తోడు బోర్ల వసతి ఉందని భావించకుండా పంటల విషయంలో రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న భూగర్భ జలాలనే వచ్చే జూలై వరకు తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
సబ్సిడీపై విత్తనాలు
పొద్దు తిరుగుడు, పప్పుధాన్యాలు, కంది, పెసర తదితర తక్కువ నీరు అవసరమయ్యే పంటల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ దివాకర తెలిపారు. పప్పు ధాన్యాల విత్తనాలు 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. నీటి లభ్యత ఆధారంగా పంటలు ఎంపిక చేసుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వరి సాగు చేయొద్దని సూచిస్తున్నా సత్తుపల్లి ప్రాంతంలో విస్తారంగా సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, జిల్లాలో ఇంకుడు గుంతలు, కమ్యూని టీ సోక్‌పిట్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. సుమారు 80వేల మంది రైతులను ఫామ్ పాండ్ల నిర్మాణానికి గుర్తించగా, వర్షపు నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టేందుకు ప్రభుత్వ భవనాల్లోనూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికప్పుడు జిల్లాలో తక్కువ వర్షపాతం లేదా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని నిర్ధారించలేమని పేర్కొన్న కలెక్టర్... వర్షాకాలం ముగిశాకే పూర్తి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఎస్‌ఆర్‌ఆర్‌లో 87.31 శాతం ఓటర్లను డిజిటలైజేషన్ చేయడం ద్వారా తొలిదశను విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితా సవరణకు మరో నెల సమయం ఉందన్నారు. మొత్తం 1.57 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి రాలేదని, ఇందులో కొందరు మృతి చెందినట్లు గుర్తించామన్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారు 1,01,000 మంది ఉండగా 11వేల మంది ఫారాలను తిరిగి ఇవ్వకపోవడానికి కారణాలను అధికారులు సేకరిస్తున్నట్లు వివరించారు. ఇంకో 550 మంది ఓటర్లను గుర్తించలేకపోయినట్లు తెలిపారు. ఒకే ఇంటి నంబర్లతో చాలా ఓట్లు ఉన్నాయన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఎస్‌ఐఆర్‌లో వాటిపై ఎలాంటి సవరణ చేయలేదని, త్వరలో యంత్రాంగం దృష్టి పెడుతుందని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సీఈ వాసంతి, ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ధనసరి పుల్లయ్య, మధుసూదన్ తదితరులు
పాల్గొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో
ఆశించిన స్థాయిలో
వర్షాలు లేవు..


