చోరీకి వెళ్లాడు.. వృద్ధురాలిని హతమార్చాడు | - | Sakshi
Sakshi News home page

చోరీకి వెళ్లాడు.. వృద్ధురాలిని హతమార్చాడు

Aug 10 2026 12:22 AM | Updated on Aug 10 2026 12:22 AM

తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఆదివారం తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఖమ్మం రూరల్‌ ఏసీపీ తిరుపతిరెడ్డి వివరాలు వెల్లడించారు. పిండిప్రోలుకు చెందిన ఐతనబోయిన ప్రశాంత్‌ చికెన్‌షాపు నిర్వహిస్తున్నాడు. మద్యానికి బానిస కావడమే కాక ఆన్‌లైన్‌ గేమ్‌లతో అప్పుల పాలయ్యాడు. షాప్‌ పక్కనే వృద్ధులైన చెన్న సుగుణ – జనార్దన్‌ దంపతులు ఉండడం, సుగుణ మెడలో బంగారు ఆభరణాలు ఉండడంతో చోరీకి నిర్ణయించుకున్నాడు. గత నెల 17న అర్ధరాత్రి వ్యాన్‌ రావడంతో కోళ్లు తీసుకున్న ప్రశాంత్‌, మాస్క్‌ ధరించి ఇంటి వెనక వైపు నుంచి వెళ్లి తలుపు కొట్టి నీళ్లుకావాలని అడిగాడు. దీంతో సుగుణ తలుపు తీసి నీళ్లు ఇస్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాగాడు. అప్రమత్తమైన ఆమె పక్కనే డబ్బాలోని కారం గుప్పించడమే కాక మాస్క్‌ తొలగించి ప్రశాంత్‌ను గుర్తుపట్టింది. దీంతో ఆందోళనకు గురైన ఆయన ఇనుపరాడ్డుతో సుగుణ తలపై మోదగా అక్కడికక్కడే కన్నుమూసింది.

పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు

వృద్ధురాలైన సుగుణను హత్య చేశాక ప్రశాంత్‌ ఆమె బంగారు గొలుసును షాపు పక్కన దాచి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లారికల్లా హత్య విషయం బయటపడడంతో ఏమీ తెలియనట్టు స్థానికులతో కలిసి పరిశీలించాడు. అంతేకాక గ్రామంలో దొంగతనాలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన చేయగా.. నిందితుడు అందులో పాల్గొనడం గమనార్హం. ఈ క్రమాన కూసుమంచి సీఐ సంజీవ్‌ నేతృత్వాన ప్రత్యేక బృందాలు గ్రామాన్ని జల్లెడ పట్టినా క్లూ లభించలేదు. ఆ తర్వాత ప్రశాంత్‌ 25 గ్రాముల బంగారు గొలుసును తన సమీప బంధువైన మరిపెడ మండలం ధర్మారానికి చెందిన సరగండ్ల మహేశ్‌కు ఇచ్చి ఆయన ద్వారా తాకట్టు పెట్టాక రూ.1.50 లక్షల నగదు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. ఈ మేరకు దర్యాప్తులో భాగంగా పలువురి కాల్‌డేటా, ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తుండగా ప్రశాంత్‌పై అనుమానం వచ్చింది. దీంతో మహేశ్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. ఈ మేరకు నిందితుడు ప్రశాంత్‌తో పాటు బంగారం తాకట్టుకు సహరించిన మహేశ్‌ను సైతం అరెస్ట్‌ చేశారు. కాగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సీఐ సంజీవ్‌, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్‌ ఎస్‌ఐలు జగదీశ్‌, సంతోష్‌, నాగరాజు, హరికృష్ణతో పాటు సిబ్బంది పూర్ణచందర్‌రావు, శ్రీలత, కిషన్‌, రాంబాబు, తొంటా శ్రీనును ఏసీపీ అభినందించిన వారికి రివార్డులు అందజేశారు. కాగా, పిండిప్రోలులో మరో రెండు చోరీ కేసుల్లోనూ విచారణ కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ ఈ సందర్భంగా తెలిపారు.

కాల్‌డేటా, నగదు లావాదేవీల ఆధారంగా నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement