మధిర/బోనకల్: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. పార్టీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ప్రజాచైతన్య యాత్ర శనివారం మధిర, బోనకల్ మండలాల్లో కొనసాగింది. మధిర మండలం మల్లవరం, మధిర, మడుపల్లి గ్రామాల్లో నిర్వహించిన సభల్లో హేమంతరావు మాట్లాడారు. రుణమాఫీ, రైతు బీమా, మహిళలకు రూ.2,500 సహా పలు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, బోనకల్ మండలంలోని మోటమర్రి, రాయన్నపేట, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాల్లో జరిగిన యాత్రలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందని, రైతుల ఉద్యమాలకు తలొగ్గి నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ మళ్లీ దొడ్డిదారిన అమలుకు యత్నిస్తోందని ఆరోపించారు. తొలుత రాయన్నపేటలో తూము ప్రకాష్‌రావు కాంస్య విగ్రహం, కలకోటలో ఆయన స్తూపానికి సీపీఐ జాతీయ సమితి సభ్యుడు హేమంతరావు నివాళులర్పించగా, యాత్రకు సీపీఎం నాయ కులు సంఘీభావం తెలిపారు. యాత్రలో సీపీఐ నాయకులు బెజవాడ రవిబాబు, జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎర్రా బాబు, ఏపూరి లతాదేవి, సిద్ధినేని కరుణకుమార్, సింగు నర్సింహారావు, సీతామహాలక్ష్మి, ఏనుగు గాంధీ, తోట రామాంజనేయులు, యంగల ఆనంద్‌రావు, తూము రోషన్‌కుమార్, కొంగర భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాచైతన్య యాత్రలో
సీపీఐ నేత హేమంతరావు


