బోనకల్: రెక్కాడితే డొక్కాడని ఓ కూలీ కుటుంబ పోషణ కోసం రాష్ట్రం దాటి రాగా ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఘటనకు సంబంధించి వివరాలు.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లికి చెందిన తేజావత్ రాము (40) జీవనోపాధి కోసం అత్తగారిల్లయిన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రాహ్మణకుంట తండాకు వచ్చి రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నాడు. బోనకల్ మండలంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులకు బ్రాహ్మణకుంట తండా నుంచి పది మంది కూలీలతో కలిసి ఆయన వెళ్లాడు. రావినూతల సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్ ట్రాలీలో వేసుకుని వెళ్తుండగా ముష్టికుంట్ల సమీపాన మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి పక్కన గోతిలోకి దూసుకెళ్లింది. దీంతో ట్రాలీ పల్టీ కొట్టడంతో రాము కింద చిక్కుకోగా మిగతా వారు బయటపడ్డారు. స్థానికులు ఆయనను బయటకు తీసి 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా, రాముకు భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా కుమార్తె వివాహం రెండు నెలల క్రితమే జరిపించాడు. ఘటనపై అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మాచినేని రవి తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా పడడంతో కూలీ మృతి


