● రామారావు హత్య కేసులో ముగిసిన ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ విచారణ ● 26 మందిని విచారించిన నిపుణుల బృందం
చింతకాని: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు(73) హత్య కేసులో నిందితులెవరో ఇప్పుడైనా తేలుతుందా, లేదా అన్న చర్చ జరుగుతోంది. చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన రామారావు హత్య జరిగిన తొమ్మిది నెలలు గడిచినా ఎలాంటి పురోగతి కానరాలేదు. హత్య కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు విస్తృతంగా విచారణ చేపట్టినా నిందితుల ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామానికి చెందిన ఆరుగురికి ఈ ఏడాది జనవరి 13వ తేదీన బెంగుళూరులో ఫోరెన్సిక్ నిపుణులు వారం పాటు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించినా పురోగతి కనిపించలేదు. చివరకు గుజరాత్ రాష్ట్రంలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ)కి చెందిన తొమ్మిది మంది నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఖమ్మం సిటీ ట్రైనింగ్ సెంటర్(సీటీసీ)లో సోమవారం నుంచి బుధవారం వరకు అనుమానితులు, కుటుంబసభ్యులు, సాక్షులు మొత్తం 26 మందిని వారు విచారించారు. వీరిలో రామారావు కుటుంబసభ్యులతో పాటు పాతర్లపాడు, ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లివాసులు ఉన్నారు. హత్య కేసుకు సంబంధించి కీలక అంశాలపై లోతుగా సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. విచారణ అంశాలను విశ్లేషించి ఇరవై రోజుల్లో జిల్లా పోలీసులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలియగా.. ఈసారైనా రామారావు హంతకుల జాడ దొరుకుతుందో, లేదో వేచి చూడాలి.


