● ఈ ఏడాది తగ్గిన డెంగీ కేసులు ● పరిసరాల పరిశుభ్రతోనే సంపూర్ణ కట్టడి
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో ఈ సీజన్‌లో వ్యాధుల ప్రభావం తక్కువగానే ఉంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్‌లో అంతగా వర్షాలు కురవట్లేదు. దీంతో క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సమస్యలు అంతగా ఉత్పన్నం కాకపోవడంతో వ్యాధుల ప్రభావం తగ్గినట్లు తెలుస్తోంది. ప్రతీ సీజన్‌లో జూలై నెలలోనే ప్రభావం చూపే డెంగీ కేసులు నామమాత్రంగానే నమోదు కాగా.. వైరల్ ఫీవర్స్ కూడా అంతగా ప్రభావం చూపకపోవడంతో ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకుంటున్నారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఓపీ సేవలు పెరిగినా అందులో జ్వరబాధితుల శాతం తక్కువగా ఉంటోంది. అలాగే జిల్లా ఆస్పత్రిలో ఎప్పటిలాగే జనం కిటకిటలాడుతున్నప్పటికీ ఒకటి, రెండు వైరల్ కేసులు మినహా డెంగీ ప్రభావం ఏమాత్రం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఎల్‌నినో దెబ్బ.. వ్యాధులకు అడ్డుకట్ట
జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో జూన్, జూలై నెలల్లో అంతగా వానలు కురవలేదు. అప్పుడప్పుడూ చిరు జల్లులు మినహా అంతగా వర్షాల ప్రభావం లేకుండా పోయింది. దీంతో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జ్వరాలు అంతగా నమోదు కాలేదు. ఎక్కువగా ఆర్థోపెడిక్, కంటి, ఇతర అనారోగ్య సమస్యలతో వైద్య సేవలకు వస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో మాత్రం గర్భిణుల పరీక్షలు, డెలివరీల కోసం, చిన్నారుల అనారోగ్య సమస్యలు, పలు రకాల ఆపరేషన్ల కోసం ఇన్‌పేషంట్లుగా చేరి చికిత్స చేయించుకుంటున్నారు. అలాగే ఓపీ సేవలు కూడా పెరిగాయి. జ్వరం కాకుండా పలు రకాల సమస్యలతోనే ఎక్కువ మంది వైద్య సేవలకు వస్తున్నారు. ఏటా ఆగస్ట్ వచ్చిందంటే ఆస్పత్రి బెడ్లు పూర్తిగా నిండిపోయి, కింద కూడా బెడ్లు వేసి చికిత్స అందించాల్సి వచ్చేది. కానీ, ఆ పరిస్ధితితులు జిల్లాలో ఎక్కడా కనిపించట్లేదు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం పరిస్ధితితులు భిన్నంగా ఉంటున్నాయి. చిన్న పాటి జ్వరంతో వచ్చినా కూడా కొన్ని ఆస్పత్రుల్లో రోగులను ప్లేట్‌లెట్స్ పేరు చెప్పి బయపెట్టి డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కరువవటంతో ప్రైవేట్ డయోగ్నొస్టిక్ యాజమాన్యాలు ఆస్పత్రులతో లాలూచి పడి అడ్డగోలు టెస్టులు నిర్వహిస్తూ దోపిడీకి తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కొందరు అధికారులు కూడా అంటకాగుతున్నట్లు తెలుస్తోంది.
అప్రమత్తత తప్పనిసరి
మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులకు కారణం దోమలే. ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వ్యాధి వ్యాపిస్తుంది. నిల్వ ఉన్న మంచి నీటిలో ఈ దోమ 200 – 300 వరకు గుడ్లు పెడుతుంది. ఈ దోమ మలేరియా ఉన్న వ్యక్తిని కుట్టి, వేరే వ్యక్తిని కుట్టడం ద్వారా మలేరియా వ్యాపిస్తుంది. అలాగే ఏడిస్ దోమ కూడా నిల్వ ఉన్న మంచినీటిలో గుడ్లు పెడుతుంది. విడతకు 300 చొప్పున తన జీవిత కాలంలో 900 గుడ్లు పెడుతుంది. ఉదయం పూటే కుట్టే ఈ దోమల వల్ల డెంగీ జ్వరం కలుగుతుంది. దీన్ని టైగర్ దోమ అని కూడా పిలుస్తారు. దీని వల్ల చికున్ గున్యా, ఎల్లో ఫీవర్ కూడా వస్తుంది. ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే నీటిపై మూతలు పెట్టడం, వాడేసిన కొబ్బరిబొండాలు, టైర్లు, పాత సామగ్రి, ప్లాస్టిక్ కప్పులు, పాత సామాన్లు, రుబ్బురోళ్లు, మొక్కల కుండీలు తదితర వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమ తెరలు వాడటం, ఇంటి కిటికీలు, డోర్లు, వెంటిలేటర్లకు మెస్‌లు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.
ఈ సీజన్‌లో పెద్దాస్పత్రిలో నమోదైన
ఓపీ, ఐపీ వివరాలు
నెల ఔట్ పేషంట్ ఇన్ పేషంట్
జూన్ 34,629 3,327
జూలై 39,739 3,666
ఆగస్టు(6వరకు) 7,127 652


