ఖమ్మంక్రైం: పలు పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న 28 మందికి ఏఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి లభించింది. ఈ సందర్భంగా వీరిని శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అభినందించి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి మాట్లాడారు. బాధ్యతలు క్రమశిక్షణతో నిర్వర్తిస్తూ మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. కాగా, ఉద్యోగోన్నతి పొందిన వారికి భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు.
సురక్షిత డ్రైవింగ్‌పై
డ్రైవర్లకు శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: ప్రమాదాల నివారణకు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలోని డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు రీజినల్ మేనేజర్ ఎ.సరిరామ్ తెలిపారు. రీజియన్ పరిధి ఏడు డిపోల డ్రైవర్లకు ఖమ్మం కొత్త బస్టాండ్ మీటింగ్‌హాల్‌లో శుక్రవారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవింగ్ సమయాన అప్రమత్తతపై వివరించారు. మంచి ఆహార అలవాట్లను కలిగి ఉండి సరైన విశ్రాంతి తీసుకుని విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ సీఐ రవికుమార్, ఏఎంవీఐ మధు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు.
అన్ని ఆస్పత్రుల్లో
పాముకాటుకు చికిత్స
ఖమ్మంవైద్యవిభాగం: వర్షాలు కురుస్తున్న నేపథ్యాన పాములు, ఇతర విషకీటకాల బారిన పడకుండగా ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రామారావు సూచించారు. పొలాల్లో పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లే వారు టార్చ్‌లైట్ వెంట ఉంచుకోవాలని, దట్టమైన గడ్డి, చెత్తాచెదారం, పొదలు ఉన్న ప్రాంతాల్లో నడిచే సమయాన శబ్దం చేస్తూ ముందుకు సాగాలని తెలిపారు. కాగా, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాము కాటుకు గురైన వారికి ఇచ్చే ఇంజక్షన్లు, చికిత్స అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్‌ఓ వెల్లడించారు. పాము కాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకుండా ఉండేలా ధైర్యం చెబుతూ ఆస్పత్రికి తీసుకెళ్లాలే తప్ప నాటు వైద్యాన్ని నమ్మి కాలం వృథా చేయొద్దని ఆయన ఓ ప్రటనలో సూచించారు.
10న జైల్ భరోను
జయప్రదం చేయండి
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న చేపడుతున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐక్య రైతు, కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అఖిలపక్ష రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల సంయుక్త సమావేశం ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించగా.. నాయకులు మాట్లాడారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవడమే కాక ట్రంప్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలనే తదితర డిమాండ్లతో చేపడుతున్న జైల్‌భరోను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ, కాంగ్రెస్, సీపీఎం, బీఆర్‌ఎస్, మాస్‌లైన్, న్యూడెమోక్రసీతో పాటు ప్రజా సంఘాల నాయకులు దొండపాటి రమేశ్, కొండపర్తి గోవిందరావు, తుమ్మల యుగంధర్, యరగర్ల హన్మంతరావు, పొన్నం వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రం, ఎండీవై పాషా, జి.రామయ్య, బందెల వెంకయ్య, ఇమ్మడి హన్మంతరావు, ప్రకాష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో ‘చేనేత నడక’
ఖమ్మంగాంధీచౌక్: జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా శుక్రవారం ఖమ్మంలో ‘చేనేత నడక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మంలోని బస్ డిపో నుంచి పెవిలియన్ గ్రౌండ్ మీదుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. చేనేత శాఖ ఏఓ శ్రీనివాసరావు, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, డీఆర్‌డీఓ శ్రీరామ్, జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, ఉద్యోగులు శర్మ, విజయలక్ష్మితో పాటు చేనేత సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో నేతన్న భరోసా చెక్కులను సహకార సంఘాల అధ్యక్షులకు అందించారు. అలాగే, చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసి చేనేత కార్మికులను సన్మానించారు.


