అన్ని వేళ్లూ ఇటువైపే... | - | Sakshi
Sakshi News home page

అన్ని వేళ్లూ ఇటువైపే...

Aug 5 2026 12:12 AM | Updated on Aug 5 2026 12:12 AM

● సత్తుపల్లి నియోజకవర్గంలో సైబర్‌ నేరాల మూలాలు ● తాజాగా పట్టాభి అరెస్టుతో కల్లూరులో కలకలం

● సత్తుపల్లి నియోజకవర్గంలో సైబర్‌ నేరాల మూలాలు ● తాజాగా పట్టాభి అరెస్టుతో కల్లూరులో కలకలం

సత్తుపల్లి: సైబర్‌ కేసుల్లో ఎక్కడ నిందితులు పట్టుబడినా అన్నివేళ్లూ సత్తుపల్లి వైపే చూపిస్తున్నాయి. రూ.వేల కోట్ల విలువైన నేరాలు బయటపడుతుండగా, నిందితులు సత్తుపల్లి నియోజకవర్గ వాసులై ఉండడంతో ఇక్కడ కలకలం రేగుతోంది. తాజాగా కల్లూరు మండలం లింగాలకు చెందిన దేవరపల్లి పట్టాభిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.వేల కోట్ల విలువైన సైబర్‌ నేరాల్లో ఆయన పాత్ర కీలకమని గుర్తించినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం కల్లూరు మండలం లింగాలలో గృహప్రవేశానికి రాష్ట్రస్థాయి ఓ మహిళా నేతను తీసుకొచ్చిన ఆయన, ఎప్పుడు స్వగ్రామానికి వచ్చినా రాజకీయ నేతలు పట్టాభిని కలిసేందుకు బారులు దీరుతారని తెలిసింది. అంతేకాక ఖరీదైన కార్లలో వస్తూ చుట్టూ బౌన్సర్లతో హడావుడి చేస్తుంటాడని చెబుతున్నారు. తెలంగాణలో ఒక పార్టీ, ఆంధ్రాలో ప్రస్తుత అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ నేర సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరించాడని, ఎక్కువగా విదేశాల్లో ఉంటూ అనుచరులతో అంతా నడిపిస్తుంటాడని తెలిసింది.

కేసు పాతదే...

గతేడాది హైదరాబాద్‌లోని కాల్‌ సెంటర్‌పై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి రూ.90 కోట్ల విలువైన సైబర్‌ క్రైం కేసులో పట్టాభిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిసింది. తాజాగా సైబర్‌ మోసాలకు పాల్పడిన ముఠాలపై నమోదైన కేసుల విచారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా సైబర్‌ సెక్యూరిటీ సిట్‌ను ఏర్పాటుచేసింది. ఈక్రమాన వీఎం బంజర్‌, సత్తుపల్లి స్టేషన్లలో నమోదైన కేసులన్నీ బదిలీ అయ్యాయి. దీంతో సిట్‌ విచారణలో పట్టాభిని కీలక నిందితుడిగా గుర్తించి అదుపులోకి మళ్లీ తీసుకున్నట్లు సమాచారం. మూడు సైబర్‌ కేసుల్లో ఇప్పటికే 52 మంది అరెస్టు కాగా, రూ.90 కోట్లతో మొదలైన నేరాల స్థాయి రూ.వేయి కోట్లు దాటడం గమనార్హం.

జియో ట్యాగింగ్‌.. ఈడీ నజర్‌

సైబర్‌ నేరస్తుల కదిలికలను గుర్తించేందుకు జియో ట్యాగింగ్‌తో నిఘా ఏర్పాటు చేశారు. నిందితులపై హిస్టరీ షీట్లు తెరిచి, నిందితుల ఇళ్లకు జియో ట్యాగింగ్‌తో తరచూ తనిఖీ చేస్తున్నారు. ఈక్రమాన కల్లూరు డివిజన్‌ పరిధిలో సైబర్‌ నేరాలు రూ.వేయి కోట్లు దాటడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు కూడా దృష్టి సారించారని సమాచారం. ఓ వైపు ఈడీ నజర్‌, మరోవైపు సిట్‌ విచారణ నేపథ్యాన నిందితులతో పాటు కొద్దిపాటి నగదుకు ఆశపడి అకౌంట్లు ఇచ్చిన వారిపై చర్యలు ఉంటాయని తెలిసింది. ఇప్పటికే మ్యూల్‌ అకౌంట్లు తెరిచిన ముగ్గురు బ్యాంక్‌ అధికారులపై కేసు నమోదవడంతో జైలు పాలయ్యారు.

ఒకరిని చూసి ఇంకొకరు

తాజాగా పట్టుబడిన సురభి విలాసవంతమైన జీవితం చూసి సత్తుపల్లి, కల్లూరు పరిసర ప్రాంతాల యువకులు కొందరు సైబర్‌ క్రైమ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు తెలిసింది. సైబర్‌ నేరాలతో సులువుగా రూ.కోట్లు కొల్లగొట్టి విలాసవంతమైన జీవితం గడపొచ్చనే భావనతో ఆ దిశగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవలే సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయి, శివ నాగరాజు అలియాస్‌ నాని రూ.4.70 కోట్ల మేర సైబర్‌ నేరానికి పాల్పడడంతో అరెస్ట్‌ అయ్యారు. నిందితులకు రాజకీయ నేతలు ఆశ్రయం లభిస్తుండడంతో మార్పు రావడం లేదనే చర్చ సాగుతోంది. ఇందులో భాగంగానే వేంసూరు మండలానికి చెందిన ఓ నిందితుడు పాత నెట్‌వర్క్‌ను మళ్లీ పునరుద్ధరించినట్లు ప్రచారం మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement