● పలు మండలాల్లో ఓ మోస్తరు వాన ● సాగులో ఉన్న పంటలకు జీవం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో కురుస్తున్న వానలు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అల్పపీడనానికి రుతుపవనాలు తోడు కావడంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తల్లాడ, కారేపల్లి, ఖమ్మం రూరల్, కల్లూరు, కామేపల్లి మండలాల్లో 6 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదు కాగా, మధిర, కూసుమంచి, పెనుబల్లి, ఏన్కూరు, ఖమ్మం అర్బన్, తిరుమలాయపాలెం మండలాల్లో 3 నుంచి 6 సెం.మీ.ల మధ్య నమోదైంది.
పంటలకు ప్రయోజనం
జిల్లాలో సాగులో ఉన్న పంటలకు ప్రస్తుత వానలు ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి. అన్నీ కలిపి వానాకాలం పంటల సాగు లక్ష్యం 5.53 లక్షల ఎకరాలకు గాను ఇప్పటికే 3.21 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో పత్తి 2.31 లక్షలు, పెసర 23 వేల ఎకరాల వరకు ఉంది. జలాశయాలకు నీరు చేరితే వరి సాగు విస్తీర్ణం పెరగనుందని చెబుతున్నారు. ఇక ప్రస్తుత వర్షాలతో పలుచోట్ల వాగుల్లో నీరు నిండి రహదారుపైకి చేరింది. కూసుమంచి మండలంలోని కొత్తూరు – నర్సింహులగూడెం మధ్య పాలేరు రిజర్వాయర్‌కు వచ్చే వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహంతో పాలేరు రిజర్వాయర్‌లోకి 800 క్యూసెక్కుల నీరు చేరుతోంది.


