రఘునాథపాలెం: రఘునాథపాలెంలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీల భర్తీకి 11వ తేదీన స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి సీహెచ్.రాంబాబు తెలిపారు. బీఎస్సీ(ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్‌డీఎస్, బీజెడ్‌సీ, ఎంబీజడ్‌సీ), బీఏ(హెచ్‌ఈపీ), బీకాం(సీఏ), బీకాం(బీఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం సౌకర్యాలు కల్పిస్తున్నందున విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఒరిజనల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని, వివరాలకు 90102 94015, 95338 88851 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు.
హాజరు మరింత పెరగాలి
కల్లూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడమే కాక వంద శాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కల్లూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. అలాగే, పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమైన ప్రీ ప్రైమరీ స్కూల్‌ను కూడా పరిశీలించారు. బోధనా విధానాలు, ఉపకరణాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు, హాజరుపై ఆరా తీశాక ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆతర్వాత అదనపు కలెక్టర్ శ్రీజ కల్లూరులోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కూడా తనిఖీ చేసి వైద్యులు, సిబ్బంది హాజరుపై ఆరా తీయడమే కాక చికిత్స వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఐకేపీ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ కుడుతుండగా పరిశీలించి వేగం పెంచాలని సూచించారు. అలాగే, జలసిరి పథకంలో భాగంగా పంట కుంటలు, ఇంకుడు గుంతల ఏర్పాటుకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఉద్యోగులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో డీసీహెచ్‌ఓ రాజశేఖర్‌గౌడ్, ఎంఈఓ పొదిలి పద్మ, మెడికల్ ఆఫీసర్ రమేష్, హెచ్‌ఎం వరక రామారావు, వివిధ శాఖల ఉద్యోగులు అశోకరాణి, మెహరాజ్, తదితరులు పాల్గొన్నారు.
డీజీపీ దృష్టికి
ఎన్నికల వివాదం
ఖమ్మంక్రైం: జిల్లాలో 13 ఏళ్ల తర్వాత పోలీసు కానిస్టేబుళ్ల, హెడ్‌కానిస్టేబుళ్ల సంక్షేమ సంఘానికి ఎన్నికలు జరుగుతుండగా ఏర్పడిన వివాదం డీజీపీ సీ.వీ.ఆనంద్ దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆయన సంబంధిత పోలీసుస్టేషన్ అధికారిపై చర్యలు తీసుకోవా లని సీపీ సునీల్‌దత్‌ను ఆదేశించినట్లు సమాచారం. ఖమ్మంలోని మహిళా పోలీసుస్టేషన్‌కు సంబంధించి ఈసీ మెంబర్‌ను ప్రత్యేకంగా ఎన్నుకోవాల్సి ఉండగా, కమాండ్ కంట్రోల్ సిబ్బందితో కలిపి సోమవారం ఎన్నిక నిర్వహించడం వివాదానికి దారితీసింది. దీనికితోడు స్వీట్లు పంచుకోవడం, పార్టీలు చేయడం, విజే త వివరాలు ముందే ప్రకటించడంతో అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న ఓ ప్యానల్ బాధ్యులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే సీపీ బాధ్యులను మందలించగా, మంగళవారం డీజీపీ సైతం సంబంధిత స్టేషన్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం గమనార్హం.
రెండో రోజు పరిశీలన
పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్ట్‌ను మంగళవారం కూడా ప్రాజెక్టుల భద్రత, స్థిరత్వ, సమర్థత(సీడీఎస్‌ఈ) బృందం పరిశీలించింది. చైర్మన్ రామారావు, సభ్యులు మొండికట్ట మార్గం వైపు కరకట్టను పరిశీలించారు. లీకేజీలపై ఆరా తీశారు. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.


