● ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ఊరట ● పాఠ్యపుస్తకాలతో పాటు నోట్స్ కూడా..
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలతో పాటు ఈ విద్యాసంవత్సరం నుంచి నోట్ పుస్తకాలు కూడా అందిస్తున్నారు. జిల్లాలో 21 ప్రభుత్వ కాలేజీలు ఉండగా 5,989మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి అవసరమైన 46,922 పాఠ్య పుస్తకాలే కాక 72వేల నోట్ పుస్తకాలు కూడా వచ్చాయి.
రెండు నెలల అనంతరం
విద్యాసంవత్సరం జూన్ 1న ప్రారంభం కాగా... ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు సకాలంలోనే చేరాయి. కానీ తెలుగు మీడియం పుస్తకాలు రాక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం అందరికీ సరిపడా పాఠ్యపుస్తకాలు రావడంతో పంపిణీ చేస్తున్నారు. డీఐఈఓ రవిబాబు బోనకల్ కాలేజీని మంగళవారం సందర్శించి నోట్ పుస్తకాల పంపిణీని ప్రారంభించారు. అందరికి సరిపడా పాఠ్య పుస్తకాలు రాగా, నోట్ పుస్తకాలు 95శాతం మేర వచ్చాయని ఆయన తెలిపారు.


