కాలం కరిగిపోతోంది.. | - | Sakshi
Sakshi News home page

కాలం కరిగిపోతోంది..

Jul 27 2026 12:24 AM | Updated on Jul 27 2026 12:24 AM

● ఈసారీ చేప పిల్లల ఉత్పత్తి కష్టమే ● వైరాలో పడావు పడుతున్న మత్స్య విత్తన అభివృద్ధి కేంద్రం ● ఎల్‌నినో ప్రభావంతో దృష్టి సారించని యంత్రాంగం

లక్ష్యం పూర్తి చేస్తాం..

● ఈసారీ చేప పిల్లల ఉత్పత్తి కష్టమే ● వైరాలో పడావు పడుతున్న మత్స్య విత్తన అభివృద్ధి కేంద్రం ● ఎల్‌నినో ప్రభావంతో దృష్టి సారించని యంత్రాంగం

వైరా: ఇప్పటివరకు జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఫలితంగా మత్స్యకారుల ఆర్థి కాభివృద్ధి కోసం ఏటా ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేసే ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ఈక్రమాన నీటి కొరతకు తోడు నిర్వహణ లోపంతో ఏటా సుమారు 50 లక్షల చేప పిల్లల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన వైరా మత్స్య విత్తన అభివృద్ధి కేంద్రం సైతం వెలవెలబోతుంది. ఈ కేంద్రం అభివృద్ధి కోసం పంపిస్తున్న ప్రతిపాదనలకు స్పందన లేకపోవడంతో చేపపిల్లల ఉత్పత్తి మొదలుకాలేదు.

ఉత్పత్తి ఇలా...

ఏటా వర్షాకాలం సీజన్‌ వస్తుండగానే కట్ల, రోహూ, బంగారుతీగ రకాల చేప పిల్లల ఉత్పత్తిపై అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఇందుకోసం తొలుత తల్లి చేపలను నీటి తోట్లలో పెంచుతారు. వీటికి ఇంజక్షన్‌ చేసిన తర్వాత రోజు గుడ్ల ఉత్పత్తి మొదలవుతుంది. ఆ గుడ్లను ప్రత్యేకమైన హేచరీస్‌లో ఉంచాక గుడ్ల నుంచి టిక్సూరీ దశ చేప పిల్ల లు తయారవుతాయి. ఇవి 2 – 3 మి.మీ.గా ఉంటాయి. ఆరేడు వారాల పాటు వీటిని ప్రత్యేక నీటి తోట్లలో పెంచితే 35 – 40 మి.మీ.కు సైజ్‌కు చేరతాయి. కాగా, ఏటా వైరా కేంద్రంలో 50 లక్షల చేప పిల్లలు ఉత్పత్తికి లక్ష్యంగా నిర్దేశిస్తున్నా.. ఈసారి 14 లక్షలకు కుదించారు. అయితే, వాతావరణ పరిస్థితులతో ఆ స్థాయిలో కూడా ఉత్పత్తి నమోదయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

కేంద్రంలో సమస్యలు..

వైరాలో మత్స్య విత్తన కేంద్రం నిర్మించి 50 ఏళ్లు గడుస్తుంది. అప్పట్లో నిర్మించిన భవనం ఆవరణలోని హేచరీస్‌ గది శిథిలావస్థకు చేరింది. మరోవైపు మోటార్‌ సరిగ్గా పనిచేయక, పైపులైన్ల లీకేజీతో నీరు సరఫరా కావడం లేదు. బాయిలర్లు సైతం తుప్పు పట్టిపోయాయి. మొత్తం 38 సిమెంట్‌ కొలనులకు గాను 15 పూర్తిగా లైనింగ్‌ కోల్పోయాయి. ఇక కేంద్రానికి ప్రహరీ లేకపోవడంతో భూమి అన్యాక్రాంతమవుతుంది. సిబ్బంది సైతం అరకొరగానే ఉండడంతో చేపపిల్లల ఉత్పత్తి లక్ష్యాలను చేరడం లేదు.

ఉమ్మడి జిల్లాలో ఏకై క కేంద్రం

ఉమ్మడి జిల్లాలోని సుమారు 800 చెరువులకు చేప పిల్లలను సరఫరా చేసేలా వైరాలో మత్స్య విత్తన కేంద్రాన్ని నిర్మించారు. 15 వేలకు మందికి పైగా మత్స్యకారులు సభ్యులుగా ఉన్న వంద మత్స్య సహకార సంఘం సొసైటీలకు చేప పిల్లలను సరఫరా చేయాలనేది లక్ష్యం. వర్షాకాలంలో దోమల నివారణకు ఉమ్మడి జిల్లా అంతటికీ గంబూషియా చేప పిల్లలను సరఫరా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఉత్పత్తి కేంద్రం నానాటికీ వైభవాన్ని కోల్పోతుండగా.. ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ చేపపిల్లల పంపిణీకి రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తోంది. అలాకాక వైరాలోని మత్స్య విత్తన కేంద్రాన్ని అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడి నుంచే ఉమ్మడి జిల్లాలోని చెరువులన్నింటికీ చేప పిల్లలు సరఫరా చేయొచ్చు.

ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక చేప పిల్లల ఉత్పత్తి ప్రారంభించలేదు. అయినా ప్రభుత్వం ఇచ్చిన 14 లక్షల చేపపిల్లల ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తిచేస్తాం. వాతావరణం అనుకూలిస్తే లక్ష్యం త్వరగా పూర్తవుతుంది. సౌకర్యాల కోసం కూడా ప్రతిపాదనలు పంపించాము.

– బానోతు వీరన్న, ఎఫ్‌డీఓ, వైరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement