● జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ భవనం సిద్ధం ● త్వరలోనే అందుబాటులోకి మెరుగైన వైద్యం
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని జిల్లా జనరల్ ఆస్పత్రి ఆవరణలో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తయింది. చిన్నచిన్న పనులు కూడా పూర్తిచేసి త్వరలోనే కాంట్రాక్టర్ భవనాన్ని ఆస్పత్రికి అప్పగించనుండగా, క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా సూపరింటెండెంట్ నరేందర్ ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. ఈ బ్లాక్ అందుబాటులోకి వస్తే జిల్లా వాసులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.
రెండేళ్లుగా నిర్మాణం
పెద్దాస్పత్రిలోని కార్డియాలజీ భవనం ఎదురుగా రెండేళ్ల క్రితం క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణాన్ని ప్రారంభించగా గత నవంబర్‌లోనే అప్పగించాల్సి ఉంది. రకరకాల కారణాలతో జాప్యం జరగగా ప్రస్తుతానికి పనులు పూర్తయ్యాయి. రూ. 23.75 కోట్ల వ్యయం, జీ ప్లస్ 4 మోడల్‌లో 50 పడకల సామర్ధ్యంతో నిర్మించిన ఈ భవనంలో ఇంటెన్సెవ్ కేర్ యూనిట్(ఐసీయూ), క్యాజువాలిటీ, జనరల్ వార్డు, డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేస్తారు. అంతేకాక రెండు ఆపరేషన్ థియేటర్లు, ప్రత్యేక ఆక్సిజన్ యూనిట్ అందుబాటులోకి వస్తుంది. అలాగే, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఇతర ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమిస్తారు. నూతన భవనంలో అమర్చేందుకు రూ.2.75 కోట్ల విలువైన బయో కెమిస్ట్రీ అనలైజర్ మిషన్ చేరగా.. దీంతో వంద రకాల పరీక్షలు, గంటకు వేయి చేయొచ్చని అఽధికారులు వెల్లడించారు. అంతేకాక రూ.60లక్షల విలువైన మూడు ఆల్ట్రా సౌండ్ మిషన్లు కూడా ఇప్పటికే వచ్చాయి. ఇంకొన్ని యంత్రాలు, బెడ్లు, ఇతర పరికరాలు అమర్చాల్సి ఉంది.


