ఆటపాఠాలు! | - | Sakshi
Sakshi News home page

ఆటపాఠాలు!

Jul 26 2026 12:09 AM | Updated on Jul 26 2026 12:09 AM

పుస్తకాలు లేకుండా..

పిల్లలకు స్కూల్‌, చదువుపై

భయం పోగొట్టేలా అమలు

జిల్లాలోని 835 పాఠశాలలు ఎంపిక

తొలి 12 వారాలు ఆటపాటలతో బోధన

అన్ని పాఠశాలల్లో అమలు..

కార్యక్రమం కొనసాగుతోంది..

నేలకొండపల్లి: నోట్‌బుక్‌లో రాయడం ఉండదు.. పాఠాలు చదవాల్సిన అవసరం లేదు. అసలు పుస్తకాలతో పనే ఉండదు.. ఆటపాటలతో విద్యార్థులకు పాఠశాల అంటే భయం పోగొట్టేలా సరికొత్త కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారి చేరిన చిన్నారులకు స్కూల్‌ అంటే భయం పోగొట్టి, చదువు అంటే బ్రహ్మపదార్థం కాదని అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఒకటో తరగతిలో కొత్తగా చేరే విద్యార్థుల కోసం విద్యాప్రవేశ్‌ (స్కూల్‌ ప్రిపరేషన్‌ మాడ్యూల్‌) పేరిట 12 వారాల పాటు జరిగే ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది.

బట్టీ విధానం కాదు..

పాఠశాలల్లో విద్యాప్రవేశ్‌ అమలైనంత కాలం విద్యార్థులతో బలవంతంగా రాయించడం, పాఠాలు బట్టీ పట్టించటం వంటి పనులు చేయించొద్దని సూచనలు చేశారు. కేవలం కృత్యాల ద్వారానే వారిలో ఆలోచనా శక్తిని పెంపొందించాలి. అంతేకాక పిల్లల పురోగతిని అంచనా వేసేందుకు 20, 40, 60వ రోజున అసెస్‌మెంట్‌ నిర్వహించాల్సి ఉంటుంది. చిన్నారుల భాషా పరిజ్ఞానం, ప్రవర్తన పరిసరాలపై అవగాహనను ఇందులో గుర్తించాలి. ఇప్పటికే పాఠశాలల్లో అమలవుతున్న ‘విద్యాప్రవేశ్‌’కార్యక్రమం ఆగస్టు 28వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందుకోసం ప్రత్యేక స్కూల్‌ ప్రిపరేషన్‌ మాడ్యూల్‌ను పాఠశాలలకు అందించగా.. మండల విద్యాశాఖాధికారులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు అమలుతీరును పర్యవేక్షిస్తున్నారు.

విద్యాప్రవేశ్‌ అమలుకు జిల్లాలోని 835 పాఠశాలలను అధికారులు ఎంపికచేశారు. చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల నుంచి లేదా తొలిసారి ఇంటి నుంచి పాఠశాలకు వస్తుంటారు. వీరు కొత్త వాతావరణం, చదువుకు అలవాటు పడేందుకు తొలి మూడు నెలల పాటు ఆటపాటలతో కూడిన కార్యక్రమం ద్వారా బోధన సాగించనున్నారు. ఈ 12 వారాల కాలంలో విద్యార్థులపై పుస్తకాల భారం మోపొద్దని విద్యాశాఖ ఆదేశించింది. పుస్తకాల ద్వారా బోధన, బోర్డుపై ఉన్నది చూసి రాయించటం, అక్షరాలు పలికించడం వంటివి పక్కన పెట్టాలని సూచించింది. వీటి స్థానంలో ఇండోర్‌, ఔట్‌ డోర్‌ ఆటలు, బొమ్మలు గీయడం, మట్టితో వస్తువుల తయారీ, కథలు చెప్పడంలో పిల్లలను భాగస్వామ్యులుగా చేయాల్సి ఉంటుంది. పిల్లల శారీరక, మానసిక వికాసం, సామాజిక భావోద్వేగ ఎదుగుదలకు కృషి చేస్తూనే ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ‘విద్యాప్రవేశ్‌’

విద్యాప్రవేశ్‌ కార్యక్రమాన్ని మండంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేస్తున్నాం. 12 వారాలు కొనసాగే ఈ కార్యక్రమం ఆగస్టు 28న ముగిస్తుంది. స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలకు పర్యవేక్షణ అప్పగించడమే కాక నేనూ పరిశీలిస్తున్నా.

–బి.చలపతిరావు, ఎంఈఓ, నేలకొండపల్లి

విద్యాప్రవేశ్‌ను మా పాఠశాలలో ముందుగానే ప్రారంభించాం. చిన్నారులకు పుస్తకాలతో సంబంధం లేకుండా పలు అంశాల్లో తీర్చిదిద్దుతున్నాం. ఇందులో పిల్లలు సంతోషంగా పాల్గొంటూ రోజూ పాఠశాలకు ఉత్సాహంగా వస్తున్నారు.

–ఇటిక్యాల సురేశ్‌కుమార్‌, ఉపాధ్యాయుడు,

కట్టుకాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement