● రూ.వేయి కోట్లతో 81 గ్రామాల్లో ప్రాజెక్టు ● రెడ్కో వైస్ చైర్మన్ ముషార్రఫ్ ఫరూఖీ
బోనకల్: అపరిమితంగా ఉన్న సౌర వనరులను సద్వినియోగం చేసుకోవడం అందరి బాధ్యత అని రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ ముషార్రఫ్ ఫరూఖీ అన్నారు. మోడల్ సోలార్ ప్రాజెక్టు పనులను బోనకల్‌లో శనివారం ఆయన టీజీ ఎన్పీడీసీఎల్ కర్నాటి వరుణ్‌రెడ్డి, కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి పరిశీలించారు. మండలంలోని రావినూతల, గార్లపాడు గ్రామాల్లోని ఇళ్లు, పొలాల్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్లను పరిశీలించాక బోనకల్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముషారఫ్ ఫరూఖీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 81 గ్రామాల్లో రూ.వేయి కోట్ల వ్యయంతో మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమానికి రూపకల్పన చేసి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరరగడం, విద్యుత్ ఉత్పత్తిలో వినియోగిస్తున్న బొగ్గు వనరులు పరిమితమైనందున పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇళ్లు, పొలాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు అందరూ ముందుకు రావాలని కోరారు. దీంతో కుటుంబాలు విద్యుత్ అవసరాలు తీరడమే కాక అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించి ఆర్థిక ప్రయోజనం పొందొచ్చని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశంతో ఇప్పటికే కొండారెడ్డిపల్లి గ్రామాన్ని పూర్తిస్థాయిలో సోలార్ గ్రామంగా అభివృద్ధి చేయగా.. మోడల్‌గా ఎంపిక చేసిన అన్ని గ్రామాల్లో ఆగస్టు 15 నాటికి పనులు పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ అధికారులు రాజుచౌహాన్, మల్లికార్జున్, ఈ.శ్రీనివాసాచారి, బండి శ్రీనివాసరావు, వై.వీ ఆనంద్‌కుమార్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంవ్యవసాయం: రైతు డిస్కం సీఎండీ, రెడ్ కో వైస్ చైర్మన్, ఎండీ ముషార్రఫ్ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ దివాకర స్వాగతం పలకగా.. జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థ, మౌలిక సదుపాయాల బలోపేతం, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించారు.


