అంతా సర్దేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

అంతా సర్దేస్తున్నారు!

Jul 26 2026 12:09 AM | Updated on Jul 26 2026 12:09 AM

● లేనివి ఉన్నట్లు సృష్టించిన రుణగ్రహీతల్లో హడావుడి ● తప్పుడు సబ్సిడీ రుణాల విలువ రూ.10 కోట్ల పైమాటే ● ఇది మరింతగా పెరిగే అవకాశం

సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం..

● లేనివి ఉన్నట్లు సృష్టించిన రుణగ్రహీతల్లో హడావుడి ● తప్పుడు సబ్సిడీ రుణాల విలువ రూ.10 కోట్ల పైమాటే ● ఇది మరింతగా పెరిగే అవకాశం

సత్తుపల్లి: అంతా బహిరంగ రహస్యమే.. అక్రమ రుణమేనని ఇచ్చేవారికి, పుచ్చుకునే వారికి కూడా తెలుసు.. అయినా అంతా మామూలే అన్నట్లు వ్యవహరించారని తెలుస్తోంది. తొలుత ఈ రుణాల వ్యవహారం డీసీసీబీకే పరిమితం అయినట్లు ప్రచారం జరిగినా.. ఇంకొన్ని బ్యాంకుల్లోనూ ఈ మకిలీ ఆనవాళ్లు ఉన్నాయని తెలుస్తోంది. ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) ద్వారా అప్పటికే ఉన్న టెంట్‌ హౌస్‌కు కొత్త ఫ్లెక్సీ ఏర్పాటుచేసి అక్రమంగా రుణం తీసుకున్నట్టు ‘సాక్షి’లో ‘లేనిది ఉన్నట్టు.. కనికట్టు’శీర్షికన శనివారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఉమ్మడి జిల్లాలో సత్తుపల్లి రెవెన్యూ డివిజన్‌లోనే పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు ఇచ్చినట్లు తెలుస్తుండగా.. వందకు పైగా రుణాలు అక్రమ పద్ధతిలో తీసుకుని రూ.కోట్లు కొల్లగొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కువగా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, దమ్మపేట మండలాల వాసులకు ఈ రుణాలు మంజూరైనట్లు తెలుస్తోంది.

గుట్టురట్టు కావడంతో..

యూనిట్లు లేకుండానే అక్రమ రుణాలు తీసుకున్నారంటూ ‘సాక్షి’లో కథనం రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. గీత టెంట్‌హౌస్‌, డెకరేషన్‌ పేరుతో ఉన్న షాప్‌నకు బాలాజీ టెంట్‌హౌస్‌ అని ఫ్లెక్సీ ఏర్పాటుచేసిన రుణం తీసుకున్న అంశం బయటపడింది. దీంతో గీత టెంట్‌హౌస్‌ పక్కనే వేరే షాపులో ఫ్లెక్సీ పెట్టి కొంత సామగ్రి సమకూర్చి అక్కడ బాలాజీ టెంట్‌హౌస్‌ ఉన్నట్లు నమ్మించే ప్రయత్నానికి దిగారు. అయితే, చాలా మంది కేబుల్‌ నెట్‌వర్క్‌, డెయిరీ ఫామ్‌, కోళ్లఫారం, వర్మీకంపోస్టు, టెంట్‌హౌస్‌, రైస్‌మిల్లులు, బ్రిక్‌ ప్రొడక్షన్‌ యూనిట్లతో సబ్సిడీ రుణాలు తీసుకోగా.. వారు కూడా యూనిట్లు ఉన్నట్లు నమ్మించే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఇదే సమయాన రాజకీయ పలుకుబడితో తమ వద్దకు ఎవరూ విచారణకు రాకుండా నిలిపివేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎవరి పాత్ర ఎంతో..

పీఎంఈజీపీ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుండడంతో మరింత పాదర్శకత కోసం పోస్టల్‌ శాఖకు విజిలెన్స్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖ అధికారులు యూనిట్లను పరిశీలించి నివేదిక ఇస్తేనే సబ్సిడీ మంజూరవుతుంది. కానీ, పలుచోట్ల యూనిట్లులేకున్నా సబ్సిడీ విడుదల కావడం వెనుక ఎవరి పాత్ర ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక రుణాల సబ్సిడీ దందా మూడేళ్ల నుంచి సాగుతోందంటూ ఎవరూ గుర్తించకపోవడంపైనా అనుమానాలు వస్తున్నాయి. సాధారణ వ్యక్తులు రుణం కోసం వెళ్తే నానా కొర్రీలుపెట్టే బ్యాంకు అధికారులు ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా మంజూరు చేశారనే సందేహాలకు సమాధానాలు లేకపోగా.. అధికారుల స్థాయిలో ఒప్పందాలు ఉండడమే కాక సిబ్బందికి కూడా తెలిసే ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో యూనిట్లకు సబ్సిడీ విడుదల చేయగా.. సగానికి పైగా యూనిట్లు లేకపోవడంతో ఆ నెపాన్ని పోస్టల్‌ శాఖ అధికారులపై వేసే యత్నాల్లో బ్యాంకు అధికారులు ఉన్నట్లు సమాచారం.

ఒక ఇంట్లో నాలుగు యూనిట్లు

పీఎంఈజీపీ పథకం లక్ష్యాన్ని అధికారులు, అక్రమార్కులు కలిసి నీరుగారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడితే వ్యాపారులు దొడ్డిదారిలో మహిళల పేరిట తీసుకుంటున్నట్లు సమాచారం. మహిళల పేరిట తీసుకుంటే సబ్సిడీ మరింత ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని తెలిసింది. ఇక బ్యాంకు అధికారుల సహకారంతో ఒక్కో కుటుంబంలో మూడు, నాలుగు యూనిట్లు కూడా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

నకిలీ పాస్‌ పుస్తకాలు పెట్టి అక్రమంగా రూ.కోట్ల రుణాలు దండుకున్న ఘటన 2017 జూలై 27న బయటపడింది. ఈ ఘటనను మరువకముందే సబ్సిడీ రుణాల కుంభకోణం బయటపడడం.. ఇందులో రూ.10 కోట్ల మేర దందా సాగినట్లు ప్రచారం జరుగుతుండడం గమనార్హం. 2017లో దమ్మపేట మండలం ముష్టిబండ కేంద్రంగా నడిచిన దందాలో 750 మంది అక్రమంగా రుణాలు పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందులో 43 మందికి పైగా జైలుపాలు ముగ్గురిపై పీడీ యాక్ట్‌ నమోదైంది. ఇందులో పాత్రధారులుగా నలుగురు బ్యాంకు మేనేజర్లు సస్పెండ్‌ కావడమే కాక జైలు జీవితం గడిపారు. అంతేకాక పోలీసుల విచారణ వివాదాస్పదం కావడంతో ఓ సీఐపై బదిలీ వేటుపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement