ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ జరిపించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
బొగ్గు రవాణా
పెంచేలా ప్రణాళిక
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో ఉత్పత్తి చేస్తున్న బొగ్గును సీహెచ్‌పీ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా సరఫరా చేస్తుండగా, దీన్ని మరింత పెంచేలా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా రైల్వేబోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ ట్రాఫిక్) అబ్దుల్ రెహమాన్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐఆర్‌టీఎస్ ఈడీ బి.వెంకన్న, ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్‌తో కలిసి సీహెచ్‌పీలోని సైలోబంకర్, రైల్వే లోడింగ్ పాయింట్లు, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించి సామర్థ్యం పెంపునకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు డి.నరేంద్రవర్మ, ఎన్‌వీఆర్.ప్రహ్లాద్, కె.సోమశేఖరరావు, బొల్లం శ్రీనివాస్, సాయినాధ, ఎ.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల్లో ఖాళీల భర్తీకి 30న పరీక్ష
వైరా/ఏన్కూరు: జిల్లాలోని తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8వ తరగతుల్లో బ్యాక్‌ల్యాగ్ ఖాళీలను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు కన్వీనర్ వేము రాజు తెలిపారు. ఈ మేరకు ఏన్కూరు గురుకులంలో బాలురు, వైరా గురుకులంలో బాలికల నుంచి ఈనెల 27, 28వ తేదీల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. వీరికి 30వ తేదీన ఉదయం 10–30 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు ఏన్కూరు, వైరాలో పరీక్ష నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తామని కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు.
సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగాలి
కల్లూరురూరల్: సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకానికి కావాల్సిన భూసేకరణతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పనులు మరింత వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. కల్లూరులో శనివారం ఆయన రెవెన్యూ, జల వనరులు, అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ కోసం మూడు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. తద్వారా ప్రభుత్వం నిర్దేశించిన వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. అలాగే, నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించడంలో జాప్యం జరగకుండా చూడాలని పేర్కొన్నారు.


