● తద్వారా జిల్లాకు క్లస్టర్ హోదా ● ‘నా పట్టు – నా అభిమానం’ సమావేశంలో కలెక్టర్ దివాకర
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో పట్టు పరిశ్రమ విస్తీర్ణాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం ‘నా పట్టు – నా అభిమానం’ జిల్లా స్థాయి భాగస్వామ్యుల సంప్రదింపుల సమావేశం జరగగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 150 ఎకరాల్లో ఉన్న పట్టు పరిశ్రమ విస్తీర్ణాన్ని వేయి ఎకరాలకు పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా జిల్లాకు క్లస్టర్ హోదా సాధించాలని తెలిపారు. ఒక్కో రైతు విడివిడిగా కాకుండా ఎక్కువ మంది కలిసి చేస్తే లాభం కలుగుతుందని చెప్పారు. అనంతరం బెంగళూరుకు చెందిన కేంద్ర పట్టు బోర్డు సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ జి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పట్టు రైతుల ఆదాయాన్ని పెంచడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకులు అనసూయ,శాస్త్రవేత్తలు డాక్టర్ తిరుపమ్‌రెడ్డి, డాక్టర్ గుండి రాఘవేందర్, హార్టికల్చర్ అధికారి అనితశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు
రఘునాథపాలెం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన, సత్వర వైద్యసేవలు అందేలా అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆయన వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలను పరిశీలించడమే కాక చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మందుల కొరత రాకుండా నిల్వలు సమకూర్చుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఆతర్వాత మండలంలో ఈర్లపూడిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులకు సూచనలు చేశారు. ఎక్కువ శాతం ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నందున లబ్ధిదారులకు అధికారులు చేయూతనివ్వాలని తెలిపారు. హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఈఈ జగ్గారావు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్, సర్పంచ్ గీతాదేవ్ సింగ్ పాల్గొన్నారు.
గోదావరి జలాల తరలింపుపై సమీక్ష
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాల తరలింపునకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే గోదావరి జలాలను వి.వెంకటాయపాలెంకు చేర్చగా, సాగర్ కాల్వలోకి రోజుకు సుమారు 1,500 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈమేరకు ఖమ్మం ప్రాంతానికి తరలించే అంశంపై కలెక్టర్ దివాకర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. భవిష్యత్‌లో తాగునీటి ఎద్దడి రాకుండా ఖమ్మం నగరం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి అవసరాలకు సరిపడా నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంచుకొండ, కొదమూరు ఎత్తిపోతల పథకాలను ఇందుకోసం వినియోగించుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ వాసంతి, అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, అర్జున్, బాబూరావు, మధు పాల్గొన్నారు.


