కోల్పోయినట్టేనా... | - | Sakshi
Sakshi News home page

కోల్పోయినట్టేనా...

Jul 16 2026 5:24 AM | Updated on Jul 16 2026 5:24 AM

ఎల్‌నినో ప్రభావంతో

వడబడుతున్న పంటలు

ఈ వారం వర్షాలు రాకపోతే

ఎండిపోయే ప్రమాదం

గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనట్లు

లోటు వర్షపాతం

గత ఏడాది, ఈ ఏడాది ఇప్పటి వరకు వర్షపాతం (సెం.మీ.ల్లో)

మెట్ట..

తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువులో

వడబడి మాడిపోతున్న పత్తి చేను (ఇన్‌సెట్‌) ఎండిపోతున్న పత్తి మొక్క

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మెట్ట పంటలు సాగు చేసిన రైతులకు కాలం కలిసిరావడంలేదు. ఎల్‌నినో తీవ్ర రూపంతో వారి ఆశలు అడుగంటుతున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలతో పంటల సాగు మొదలుపెట్టగా.. ఈ నెల ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంటలు వడబడుతున్నాయి. వచ్చే వారం రోజుల్లో వర్షాలు పడకపోతే పంటలు కోల్పోయినట్లేనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

తొలకరి ఉరకలు పెట్టించి..

జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కొనసాగే వానా కాలం సీజన్‌లో మొదటి రెండు నెలలు కీలకం. ఈ రెండు నెలల్లో మెట్టతో పాటు రిజర్వాయర్ల నుంచి ఆయకట్టుకు నీరు విడుదలైతే తరి పంటలు కూడా సాగవుతాయి. ఈమేరకు జూన్‌లో తొలకరి వర్షాలు మొదలై నెలాఖరు వరకు కొనసాగడంతో రైతులు మెట్ట పంటల సాగుకు సిద్ధమయ్యారు. జూన్‌లో సాధారణ సగటు వర్షపాతం (ఒక్కో మండలంలో) 13.1 సెం.మీ. కాగా 15.4 సెం.మీ.గా నమోదైంది. గత ఏడాది కంటే ఇది ఎక్కువే కావడంతో రైతులు సంతోషించారు. వర్షాధారంగా సాగయ్యే పత్తిని అ్యధికంగా 2,24,067 ఎకరాలు సాగు చేసినా ప్రస్తుతం వారి ఆశలు అడియాశలవుతున్నాయి.

చినుకు జాడ లేక..

తొలకరి వర్షాలు, మధ్యలో పొడి వాతావరణంతో పత్తి విత్తనాలు చాలా ప్రాంతాల్లో మొలకెత్తలేదు. అదును దాటిపోతుందని రైతులు రెండోసారి కూడా నాటారు. అయినా ఫలితం దక్కక.. మొలకెత్తిన మొక్కలు కూడా వర్షం లేక వడబడుతున్నాయి. దాదాపు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం చల్లటి వాతావరణానికి పంట కళకళలాడుతున్నా మధ్యాహ్నం ఎండ తీవ్రత, వడగాలితో వడలిపోతున్నాయి.

గత కొన్నేళ్లలో లేని పరిస్థితి

పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర పంటలు కళ్లముందు ఎండిపోతున్నా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో రైతులు ఉన్నారు. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనట్లు ఈ నెల లోటు వర్షపాతం నమోదైంది. ఈనెల ఇప్పటి వరకు 15 రోజుల్లో సగటున ఒక్కో మండలంలో 11.7 సెం.మీ. వర్షపాతం నమోదు కావాలి. కానీ కేవలం 2.1 సెం.మీ. వర్షపాతమే నమోదవడం పంటలపై ప్రభావం చూపుతోంది.

ఆశగా ఎదురుచూస్తూ...

మొక్క దశలో మెట్ట పంటలు ఉన్నప్పుడు వర్షం లేకపోతే రైతు కష్టమంతా దుక్కిలోనే కలిసిపోనుంది. ఈ వారంలో తగిన వర్షాలు లేకపోతే మొక్కలు మాడిపోయే అవకాశముంది. కారు మబ్బులు పట్టినట్లు ఆకాశం కనిపించినా వేడి గాలుల తీవ్రతతో అవి తేలిపోతుండగా.. చాలా ప్రాంతాల్లో కనీసం జల్లులు కూడా కురవడం లేదు. జల్లులు పడి తేమ శాతం పెరగడమే కాక ఒకటి, రెండు భారీ వర్షాలు కురిస్తే తప్ప పత్తి పంట చేతికి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

నైరుతి వంచించి..

రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే గత నెల జిల్లాలో సాధారణాన్ని మించి వర్షపాతం నమోదైంది. జూన్‌ సగటు వర్షపాతం 13.1 సెం.మీ.కు గాను 15.4సెం.మీ.గా నమోదు కావడంతో రైతులు మెట్ట పంటలు ముమ్మరంగా సాగు చేశారు. ఈనెలకొచ్చే సరికి పరిస్థితి భిన్నంగా ఉండడంతో నైరుతి వంచించినట్టేనని వాపోతున్నారు. మరోపక్క ఎల్‌నినో తీవ్రత ఇంకా పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన మిగిలిన మూడున్నర నెలల్లో ఒకటి, రెండైనా భారీ వర్షాలు కురుస్తాయా, లేదా అన్న సందిగ్ధత నెలకొంది. గత ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు జూన్‌ మినహా మిగతా మూడు నెలల్లో సాధారణ వర్షపాతాన్ని మించి నమోదైంది. కానీ ఈనెల పదిహేను రోజుల్లో అతి తక్కువ వర్షపాతం నమోదుకావడం ఎల్‌నినో తీవ్రతకు అద్దం పడుతోంది.

గత నెలలో కురిసిన

వర్షాలతో పంటల సాగు

2025 2026

నెల సాధారణం నమోదు సాధారణం నమోదు

జూన్‌ 13.1 11.8 13.1 15.4

జూలై 24.1 26.0 11.7 2.1

ఆగస్టు 24.0 37.1

సెప్టెంబర్‌ 17.8 23.1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement