నేడు డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన

Jul 16 2026 5:24 AM | Updated on Jul 16 2026 5:24 AM

ఖమ్మమంయూరిసెంటర్‌: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10–30 గంటలకు మణుగూరుకు హెలీకాప్టర్‌లో చేరుకోనున్న వారు అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం ఆఫ్‌టేక్‌ పాయింట్‌ను పరి శీలించి పనులపై అధికారులతో సమీక్షిస్తారు. ఆతర్వాత సత్తుపల్లి మండలం యాతాలకుంటకు చేరుకుని టన్నెల్‌ నిర్మాణ పురోగతిని పరిశీలించి పనులు, భూసేకరణ తదితర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు.

ఏర్పాట్ల పరిశీలన

సత్తుపల్లి: సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద టన్నెల్‌ నిర్మాణ పనులను గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పరిశీలించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లను కలెక్టర్‌ దివాకర, సీపీ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

ఆస్తుల రక్షణ, ప్రయాణికుల భద్రతే కీలకం

ఆర్‌పీఎఫ్‌ ఐజీ అరోమాసింగ్‌ ఠాగూర్‌

ఖమ్మంక్రైం: రైల్వే ఆస్తులను పరిరక్షించడమే కాక ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా విధులు నిర్వర్తించాలని ఆర్‌పీఎఫ్‌ ఐజీ అరోమాసింగ్‌ ఠాగూర్‌ సూచించారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లోని ఆర్‌పీఎఫ్‌ పోలీస్‌స్టేషన్‌ను ఐజీ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీసీ టీవీ కంట్రోల్‌ రూమ్‌ పనితీరు, రికార్డులు, కేసుల విచారణ వివరాలు ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసుల దర్యాప్తు, నిందితుల గుర్తింపునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విధుల్లో ఆర్‌పీఎఫ్‌ ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటూ రైల్వే ప్రయాణికులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని తెలిపారు. తొలుత ఐజీకి సీఐ సురేష్‌గౌడ్‌ స్వాగతం పలకగా, సీనియర్‌ డివిజనల్‌ కమిషనర్‌ నవీన్‌కుమార్‌, జీఆర్‌పీ సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ వెంకటేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఆరుతడి పంటలే

సాగు చేయండి

మధిర: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యాన ప్రస్తుత సీజన్‌లో తక్కువ కాల వ్యవధి, తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. మధిర మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించిన ఆయన రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలుగా పెసర, మినుము, కంది, జొన్న, ఇతర చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వర్షాభావంతో భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉన్నందున వరి, మిర్చికి బదులు ఇతర ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచించారు. అంతేకాక ప్రభుత్వం వీబీజీ–రామ్‌ జీ పథకం ద్వారా పొలాల్లో ఫామ్‌ పాండ్స్‌(పంట కుంటలు) నిర్మాణానికి వంద శాతం రాయితీ ఇస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్‌, ఏఈఓలు పాల్గొన్నారు.

పోలీస్‌ డ్యూటీమీట్‌లో పతకాలు

ఖమ్మంక్రైం: వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇటీవల జరిగిన భద్రాద్రి జోనల్‌ పోలీస్‌ డ్యూటీ మీట్‌లో జిల్లా పోలీసులు పతకాలు సాధించారు. వివిధ విభాగాల్లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ ఉదయ్‌కుమార్‌ రెండు బంగారు పతకాలు, కూసుమంచి ఎస్‌ఐ దివ్య కాంస్య పతకం, ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఎం.మహేష్‌ కాంస్య పతకాలు సాధించగా సీపీ సునీల్‌దత్‌ అభినందించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement