ఏఎస్‌ఆర్ కాలేజీ టాప్..
కందుకూరు లాస్ట్
ప్రవేశాల పెంపునకు ప్రయత్నాలు
● ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు అంతంతే.. ● 6,986 సీట్లకు 2,699 మాత్రమే భర్తీ
ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో సౌకర్యాలు కల్పిస్తూ అవసరమైన మేర అధ్యాపకులను నియమించింది. అంతేకాక ఈ ఏడాది నుంచి విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రకటించినా విద్యార్థుల నుంచి నామమాత్రపు స్పందనే లభించింది. ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సీట్లు భర్తీ కాలేదు. జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం సీట్లు 6,986 ఉండగా.. 2,699 మంది మాత్రమే ప్రవేశాలు పొందడం గమనార్హం.
సౌకర్యాలు ఉన్నా...
దాదాపు అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సరిపడా భవనాలు ఉన్నాయి. అవసరమైన చోట్ల మరమ్మతులు చేయించిసౌకర్యాలు కల్పించారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, అందించడమే కాక వివిధ విభాగాల్లో అధ్యాపకుల నియామకం చేపట్టారు. అయినా ప్రవేశాలు ఏటా మాదిరిగానే ఈసారి కూడా నామమాత్రంగానే నమోదయ్యాయి. కనీసం సగం సీట్లు కూడా భర్తీ కాకపోవడంతో ఎక్కడ లోపం ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. అధ్యాపకులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నా గత నాలుగేళ్ల నుంచి సీట్లు సరైన స్థాయిలో భర్తీ కావడం లేదు. ఈ ఏడాది కొత్తగా విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రకటించినా ఆశించిన ఫలితం దక్కలేదు.
జిల్లాలో 21కాలేజీలు ఉండగా, ఖమ్మంలోని ఏఎస్‌ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో 488 సీట్లకు గాను అత్యధికంగా 420 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇక వేంసూరు మండలం కందుకూరు జూనియర్ కళాశాలలో 176 సీట్లకు కేవలం 12 మందే చేరారు. అలాగే, బనిగండ్లపాడు కాలేజీలో 85 సీట్లకు 14 మంది, నేలకొండపల్లి కాలేజీలో 320 సీట్లకు 29 మంది ఇప్పటివరకు చేరారు. మిగతా కాలేజీల్లోనూ ప్రథమ సంవత్సరం సీట్లు సగం కూడా భర్తీ కాలేదు.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఈసారి 30 శాతం ప్రవేశాలు పెంచాలనే లక్ష్యంతో ప్రిన్సిపాళ్లు, సిబ్బందితో సమీక్షించాం. దీంతో కొంత మేర ఫలితం వచ్చింది. ఇంకొన్ని సీట్లు కూడా త్వరలో భర్తీ అయ్యే అవకాశముంది.
– రవిబాబు, డీఐఈఓ, ఖమ్మం


