● జిల్లాలో రెవెన్యూ స్టాంప్‌ల కొరత ● ఇదే అదునుగా రూ.5 నుంచి రూ.10 వరకు విక్రయం
ఖమ్మంగాంధీచౌక్: ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సరఫరా లేక రూ.1 రెవెన్యూ స్టాంపులకు కొరత ఏర్పడింది. పలు అవసరాలకు ఉపయోగపడే ఈ స్టాంప్‌లను రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తుంది. పోస్టాఫీసుల్లోనూ విక్రయాలు జరుగుతుంటాయి. అయితే, ఉమ్మడి ఖమ్మంలోని పోస్టల్ డివిజన్ నుంచి ప్రతీ 20 రోజులకు 1.28 లక్షల స్టాంపులు కావాలని ఇండెంట్ పెట్టి, స్టాక్ వచ్చాక ప్రధాన, బ్రాంచ్ పోస్టాఫీసుల ద్వారా విక్రయిస్తుంటారు. కానీ ఇండెంట్ పెడుతున్నా ఆశించిన స్థాయిలో సరఫరా లేక పోస్టాఫీసుల్లో 15 రోజులుగా కొరత ఏర్పడగా ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేశారు.
పలు అవసరాలకు తప్పనిసరి
రూ.1 రెవెన్యూ స్టాంపులను కోర్టుల్లో అఫిడవిట్లు, న్యాయవాదులు పిటిషన్లు వేసేందుకు ఉపయోగిస్తారు. చిట్‌ఫండ్స్‌లో లావాదేవీలు, పలు రకాల పెన్షన్లు, అప్పులు, ప్రామిసరీ నోట్లపైనే కాక పలు ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాల జారీ సమయాన వినియోగిస్తారు. కానీ, ఈ స్టాంప్‌ల కొర త ఏర్పడడంతో కొందరు వ్యాపారులు తమ వద్ద స్టాక్ ఉన్న వాటిని ఏకంగా రూ.5 నుంచి 10 వరకు విక్రయిస్తున్నారు. కొరతను ముందే గుర్తించి కొంద రు వ్యాపారులు తపాలా ఉద్యోగులను మచ్చిక చేసు కుని ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లు సమాచారం.
సరఫరా లేకే కొరత
రెవెన్యూ స్టాంప్‌ల కొరతపై ఖమ్మం పోస్టల్ డివిజన్ వీరభద్రస్వామి వివరణ కోరగా.. ఇండెంట్లకు తగిన సరఫరా లేదని తెలిపారు. కొద్ది రోజులుగా ఇదే పరి స్థితి నెలకొదని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి స్టాంప్‌లు సరఫరా అయ్యేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.


